24 గంటల్లో బాలికల ఆచూకీ లభ్యం
తాడేపల్లిగూడెం రూరల్ : బాలికల మిస్సింగ్ కేసు ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కేసు నమోదైన 24 గంటల్లోనే బాలికల ఆచూకీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. ఆదివారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ రమేష్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయానికి చెందిన ఓ మహిళ ఈనెల 12న రాత్రి నుంచి తన కుమార్తె, ఇంటి ఎదురుగా ఉన్న మరో బాలిక కనిపించడం లేదంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 13న రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ డి.విశ్వనాథ్ పర్యవేక్షణలో రూరల్ సీఐ రమేష్, టౌన్ సీఐ ఆదిప్రసాద్, రూరల్ ఎస్సై ప్రసాద్, పెంటపాడు ఎస్సై స్వామిలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పుటేజ్, బాలికల ఫోన్ కాల్ డేటా, వారి స్నేహితుల కాల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించగా బాలికలు చైన్నెలో ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాల సాయంతో వారిని తాడేపల్లిగూడెం క్షేమంగా తీసుకువచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో బాలికలు స్నాప్‌చాట్ ద్వారా యువకులతో సంభాషించేవారని, చైన్నె వెళ్లి పనిచేసుకుంటూ పెళ్లి చేసుకోవాలని వీరు భావించినట్టు తెలిసిందన్నారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐ రమేష్ తెలిపారు. పిల్లలను సెల్‌ఫోన్లు వీలైనంత దూరంగా ఉంచాలని, లేదంటే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసును 24 గంటల్లోనే ఛేదించిన రూరల్ సీఐ రమేష్, టౌన్ సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు జేవీఎన్ ప్రసాద్, స్వామి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అభినందించారు. సమావేశంలో టౌన్ సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు జేవీఎన్ ప్రసాద్, కేసీహెచ్ స్వామి పాల్గొన్నారు.


