పూడికతీత తూతూమంత్రమేనా? | - | Sakshi
Sakshi News home page

పూడికతీత తూతూమంత్రమేనా?

May 28 2025 5:59 PM | Updated on May 28 2025 5:59 PM

పూడిక

పూడికతీత తూతూమంత్రమేనా?

తొలకరి సాగుకు ఊతమిస్తూ రుతుపవనాలు వచ్చేశాయి. త్వరలో కాలువలకు నీరు విడుదల కానుంది. కోటి ఆశలతో ఏరువాక సన్నాహాల్లో రైతులను డ్రెయిన్లు గురప్రుడెక్క, కిక్కిస, వ్యర్థాలు, ఆక్రమణలతో కుంచించుకుపోయి కలవరపరుస్తున్నాయి. సాగుకాలం సమీపిస్తున్నా చాలాచోట్ల పూడికతీత పనులు ఇంకా మొదలుకాలేదు.
భీమవరంలో గుర్రపుడెక్కతో నిండిపోయిన గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌

సాక్షి, భీమవరం: జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆకివీడు సబ్‌డివిజన్లలో బొండాడ, గునుపూడి సౌత్‌, గొంతేరు, భగ్గేశ్వరం, మొగల్తూరు, కాజా, రుద్రయ్య కోడు తదితర 294 కిలోమీటర్ల పొడవున 13 మేజర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. 330 కిలోమీటర్లు పొడవున 41 మీడియం డ్రెయిన్లు, 956 కిలోమీటర్లు పొడవున 454 మైనర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో గురప్రుడెక్క, తూడు పెరిగిపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. తుపాన్లు ఏర్పడినప్పుడు రోజుల తరబడి ముంపునీరు లాగక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మంపునీటిని బయటకు పంపేందుకు రైతులు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఏటా తొలకరి సాగు ప్రారంభానికి ముందే డ్రెయిన్లలో గురప్రు డెక్క, కిక్కిస తొలగింపు పనులు పూర్తి చేస్తుంటారు.

రూ. 14 కోట్లు మంజూరు:

రానున్న వ్యవసాయ సీజనన్‌కు గురప్రుడెక్క తొలగింపు, పూడికతీత నిమిత్తం సుమారు రూ.17 కోట్లు విలువైన 370కు పైగా పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 349 పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 270 వరకు గురప్రుడెక్క తొలగింపు, మిగిలినవి పూడికతీత పనులు ఉన్నాయి.

ఈ నిధులతో సాగుకు ముందే పూడిక సమస్యను పరిష్కరించడంతో పాటు ఏడాదిపాటు డ్రెయిన్ల నిర్వహణ చేయాలి. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటిసంఘాల మాటున నామినేషనన్‌ పద్దతిపై కూటమి నేతలు పనులు దక్కించుకున్నారు. సాగుకాలం ముంచుకొస్తుండగా చాలామంది ఇంకా పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. తూతూమంత్రంగా పనులు చేసేందుకు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డ్రెయిన్‌న్స్‌ ఈఈ సత్యనారాయణను సంప్రదించగా పూడికతీత పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వర్షాల వలన కొన్నిచోట్ల స్ప్రేయింగ్‌ పనులు ఇంకా మొదలుకాలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

గత ఏడాది వెంటాడిన ముంపు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేపట్టారు. సీజనన్‌ ప్రారంభంలోనే భారీ వర్షాలతో డ్రెయిన్ల పొంగి ప్రవహించాయి. పూడికతో ముంపునీరు లాగక 14 వేల ఎకరాల్లోని నాట్లు, 30 వేల ఎకరాలకు చెందిన నారుమడులు దెబ్బతినడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది.

గురప్రుడెక్క, కిక్కిస, వ్యర్థాలతో కుచించుకుపోయిన డ్రెయిన్లు

జిల్లాలో 349 పూడికతీత పనులకు రూ.14 కోట్ల మంజూరు

నీటి సంఘాలు మాటున కూటమి నేతలకే పనులు

సకాలంలో మొదలుపెట్టకుండా

నామమాత్రంగా చేసే ఎత్తుగడ

పాలకోడేరు, భీమవరం మండలాల్లో ప్రధానమైన గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌ గురప్రు డెక్క, వ్యర్థాలతో పూడుకుపోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి ప్రవాహవేగాన్ని గురప్రుడెక్క అడ్డుకుని సకాలంలో ముంపునీరు లాగక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

పూడిక తొలగించాలి

బక్లెస్‌ డ్రెయిన్‌ ముంపుతో తీవ్రంగా నష్టపోతున్నాం. సార్వాకు ముంపు బెడద లేకుండా డ్రెయిన్‌లోని ప్రక్షాళన చేయాలి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నాచు, గురప్రు డెక్క తొలగింపు పనులు చేయించాలి.

– తోరం వెంకట సుబ్బయ్య, రైతు, పడమర విప్పర్రు

త్వరితగతిన పనులు చేపట్టాలి

తొలకరి పనులు మొదలయ్యే నాటికి డ్రెయిన్లలో పూడికతీత పనులు పూర్తిచేయాలి. అలాగే యనమదుర్రు డ్రెయిన్‌్‌ పూడిక ప్రధాన సమస్యగా ఉంది. ఆక్రమణలు, పూడిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

– తోలేటి వెంకటేశ్వరరావు, రైతు, తిరుపతిపురం

పూడికతీత తూతూమంత్రమేనా? 1
1/2

పూడికతీత తూతూమంత్రమేనా?

పూడికతీత తూతూమంత్రమేనా? 2
2/2

పూడికతీత తూతూమంత్రమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement