
ముగిసిన ఈఏపీ సెట్
భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. భీమవరం పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో ఏపీ అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించగా ఈ నెల 21 నుంచి మంగళవారం వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు జరిగాయి. మంగళవారం పరీక్షకు పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 165 మంది హాజరుకాగా, విష్ణు ఉమెన్స్ కళాశాలలో ఉదయం 87 మందికి 85 మంది, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 106 మంది హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 94 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 99 మంది హాజరయ్యారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం: పెద తాడేపల్లి వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 228 మందికి 221 మంది హాజరయ్యారు. ఈ కేంద్రంలో ఇంతవరకూ 3239 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 3061 మంది పరీక్షకు హాజరయ్యారు.
‘పది’ సప్లిమెంటరీ పరీక్షకు 65 శాతం హాజరు
భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు 65 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. 139 మంది విద్యార్థులకు 48 మంది గైర్హాజరయ్యారన్నారు. 7 పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో నిర్లక్ష్యం వహి స్తూ సమావేశాలకు గైర్హాజరవుతున్న మున్సిపల్ అధికారుల పై, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ రీజనల్ డైరక్టర్ సీహెచ్ నాగ నర్సింహరావు హెచ్చరించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీలకు నిర్ధేశించిన లక్ష్యాలను, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై స్థానికంగా ఉన్న కమిషనర్లు సస్పెండ్ వరకూ చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలకు సంబంధించి కమిషనర్లు, రెవెన్యూ అధికారులు ప్లానింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
భీమవరం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ. నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ కేటగిరిలో 27 మంది, ఒకేషనల్‌లో 99 మంది హాజరుకానున్నారని. జనరల్ విద్యార్ధులకు శ్రీగ్రంఽధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల, ఒకేషనల్ విద్యార్థులకు ప్రశాంతి ఒకేషనల్ జూనియర్ కళాశాల, పెనుగొండలోని ఎస్‌వీకేపీ అండ్ పీవీ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు.
నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2025–26 అడ్మిషన్లలో భాగంగా ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి 31 వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు చేశారు. 28న సైనికోద్యోగుల పిల్లల (సీఏపీ) కోటాలో 153 మంది, క్రీడా కోటాలో 320 మంది కలిపి మొత్తం 473 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. 29న సీఏపీ కోటాలో 117, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 247, ఎన్‌సీసీ కోటాలో 341, క్రీడా కోటాలో 245 మొత్తం కలిపి 950 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 30న ఎన్‌సీసీ కోటాలో 452, క్రీడా కోటాలో 467, మొత్తం 919 మంది, 31న ఎన్‌సీసీ కోటా అభ్యర్థులు 661 మంది సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.

ముగిసిన ఈఏపీ సెట్