
గోదావరిలో ముగ్గురు బాలుర గల్లంతు
పెనుగొండ: కోనసీమలో గోదావరిలో ఎనిమిది మంది యువకుల గల్లంతు వార్త మరువక ముందే.. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద స్నానానికి దిగిన బాలురలో ముగ్గురు గల్లంతవడం తీవ్ర విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం ముగ్గురు బాలురు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్(15), సానబోయిన సూర్యతేజ(12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి మండలం పెదలంకకు చెందిన నీతిపూడి పాల్ కుమార్(15) స్నేహితులతో కలసి గత కొన్ని రోజులుగా గోదావరి స్నానానికి వస్తున్నారు. ఇదే కోవలో మంగళవారం మధ్యాహ్నం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ప్రవీణ్, సూర్యతేజ, పాల్ కుమార్ మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు భయపడి వెంటనే బంధువులకు సమాచారం అందించారు. కేతా ప్రవీణ్, పాల్‌కుమార్ ఇటీవల పదో తరగతి పరీక్షలు పూర్తిచేశారు.
పేద కుటుంబాల్లో పెను విషాదం
గల్లంతైన ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి మేసీ్త్ర.. పాల్‌కుమార్ తండ్రి మృతి చెందడంతో తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లింది. ముగ్గురు బాలురు గల్లంతుతో సంఘటన ప్రాంతంలో విషాదం నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆజ్మీ, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురు బాలుర కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద ఘటన
స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిన బాలురు
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు

గోదావరిలో ముగ్గురు బాలుర గల్లంతు

గోదావరిలో ముగ్గురు బాలుర గల్లంతు