
ప్రకృతి సాగుపై లెక్కలు చెప్పండి
ఉండి : లెక్కాపత్రాలు లేకుండా ప్రకృతి సాగు ఎక్కువగా చేస్తున్నారని చెబితే నమ్మేదెలా అంటూ రాష్ట్ర అడిషినల్ సీఎస్ అజయ్‌జైన్ రైతుల ఎదుటే వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. బుధవారం మండల పర్యటనలో భాగంగా జేసీ రాహూల్‌కుమార్‌రెడ్డితో కలసి ముందుగా మహదేవపట్నం గ్రామంలో పర్యటించిన ఆయన సచివాలయం, అంగన్‌వాడీ తదితర ప్రదేశాలను పరిశీలించి స్థానికులతోను, అధికారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం ఎన్నార్పీ అగ్రహారంలో ప్రకృతి సాగు నిర్వహిస్తున్న ఓ రైతు క్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై చేపట్టిన కార్యక్రమాలపై ప్రదర్శించిన బ్యానర్‌లను పరిశీలించా అధికారులను లెక్కలు అడిగారు. దానికి వారి నుంచి కొంత ఆలస్యంగా జవాబు వచ్చినా చివరకు 563 ఎకరాలు అంటూ సిబ్బందిలో ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు, లెక్కలు లేకుండా ఎలా నమ్మేది అంటూ వారిని ఆయన ప్రశ్నించారు. దీంతో వ్యవసాయాధికారులు నీళ్లు నమిలారు. అనంతరం బ్యానర్లలో ప్రదర్శిస్తున్న డ్రోన్‌ల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం మీ వద్ద ఎన్ని డ్రోన్‌లు ఉన్నాయని ఆరా తీయగా రెండు ఉన్నాయని.. అవి పనిచేయడం లేదని సమాధానమివ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. డ్రోన్ పైలట్ సరిగా ఆపరేట్ చేయకపోవడంతో అది కాస్త చెట్టుకు ఢీకొని పాడైందని సమాధానమివ్వడంతో ఎందుకు బాగు చేయించలేదంటూ ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన ఓ చిరుధాన్యాల స్టాల్‌ను కూడా ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం లాభసాటి అయితే ఎందుకు ఎక్కువమంది రైతులు సాగుచేయడం లేదంటూ ప్రశ్నించారు. మార్కెట్‌లో ఆర్గానిక్ పేరు చెప్పి సాధారణ పంటలు కూడా అమ్మేస్తున్న కారణంగా వినియోగదారులు నమ్మలేకపోతున్నారని ఆయన అన్నారు.
గత ప్రభుత్వమే నయం
కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ రైతు ఈ ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన వెంటనే రైతు ఖాతాలో సొమ్ము పడిపోతుందంటూ నమ్మబలికాడు. అయితే దానికి రైతు కవురు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు రైతులు ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వంలోనే వెంటనే సొమ్ములు వచ్చేవని ఎవరో కొందరికి మాత్రమే ఆలస్యం అయ్యాయని ఏ ప్రభుత్వంలో అయినా అలాగే జరుగుతుందని రైతులు అడిషినల్ సీఎస్‌కు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మకం చేసి చాలా రోజులైనా ఇంతవరకు తమకు సొమ్ములు ఖాతాల్లో పడలేదని కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయాధికారులను ప్రశ్నించిన రాష్ట్ర అడిషినల్ సీఎస్
డ్రోన్లు సైతం పనిచేయకపోవడంపై అసహనం