
భారత సైన్యానికి సంఘీభావం
భీమవరం (ప్రకాశంచౌక్): భారత సైన్యానికి మనోధైర్యం కల్పించేందుకు భీమవరం, ఉండి నియోజకవర్గాల స్థాయిలో శనివారం భీమవరంలో భారీ సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించడమే లక్ష్యంగా పోరాడుతున్న సైన్యానికి అందరూ సంఘటితంగా ఉంటూ సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని డిప్యూటీ స్పీక్టర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. జువ్వలపాలెం రోడ్డులోని అడ్డ వంతెన మూర్తి రాజు విగ్రహం నుంచి టాటా విగ్రహం వరకు పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశంపై ఎలాంటి దాడులను ఉపేక్షించేది లేదన్నారు. పీఏసీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ తీవ్రవాదాన్ని అంతమొందించడంలో ప్రధాని మోదీకి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. అడిషనల్ ఎస్పీ వి.భీమరావు, ఎకై ్సజ్, అగ్నిమాపక శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.