
మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్
వీరవాసరం: రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వీరవాసరం మండలంలోని రాయకుదురు, బొబ్బనపల్లి, మెంటేపూడి తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రహదారి పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడారు. సీజన్‌లో 9 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం పంట దిగుబడి వస్తుందని అంచనా వేశారని, ప్రస్తుతం 6 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అనుమతులు ఇచ్చారని, మిగిలిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తేమ శాతం బట్టి కాకుండా కొనుగోలు చేయాలని కోరారు. దళారీ వ్యవస్థను లేకుండా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. పంట నష్టం వల్ల కౌలు రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క గింజ కూడా మిగలకుండా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.