
ధాన్యం దిగుబడి లెక్కల్లో తేడాలు
భీమవరం: అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తప్పుడు లెక్కలతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్‌లో 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా పంట చేతికి వచ్చే సమయంలో వ్యవసాయశాఖ దాదాపు 9.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దీనిలో సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు తమ సొంత ఆహార అవసరాలకు వినియోగించుకున్నా 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతిచ్చింది. భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి చెప్పిన లెక్కలకు గతంలో వ్యవసాయశాఖ తెలిపిన లెక్కలకు పొంతన లేదు. జిల్లాలో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అధికారులు అంచనా 9.25 లక్షల మెట్రిక్ టన్నులకు మంత్రి చెప్పిన 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి పొంతనలేదు. ధాన్యం కొనుగోలు చేయలేక చేతులెత్తేసే ప్రక్రియలో భాగంగా మంత్రి లెక్కల్లో తేడాలు చూపించారని రైతుల సంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
9.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిగా వ్యవసాయ శాఖ అంచనా
మంత్రి మనోహర్ అంచనా కేవలం 7.50 లక్షల మెట్రిక్ టన్నులే