ద్వారకాతిరుమల: రైతులకు పీఎండీఎస్ కిట్లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట ఎన్‌పీఎం షాపులో సిద్ధం చేసిన 2 వేల కిట్లను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల్లో 16 రకాల విత్తనాలను కలిపి ఈ కిట్‌ను తయారు చేశామని, వీటిని రుతుపవనాలు వచ్చే ముందు వేయాలన్నారు. మెంతులు, ఆవాలు, తోటకూర తదితర విత్తనాలు కలగలిపి 12 కేజీల బరువుతో ఈ కిట్ ఉంటుందన్నారు. ఈ విత్తనాల ద్వారా సాగు చేయడం వల్ల పశువులకు మేత పుష్కలంగా లభిస్తుందన్నారు. అలాగే ఆకు కూరలు, ఆవాలు, మెంతులను రైతులు విక్రయించుకోవచ్చన్నారు. మొత్తం 10 వేల మంది రైతులకు అందించే లక్ష్యంలో భాగంగా, తొలి విడతగా 2 వేల కిట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏడీఏ ఉషారాజ్ కుమారి, ఏడీపీఎం బాలిన వెంకటేష్, ద్వారకాతిరుమల, భీమడోలు ఏవోలు ఎ.దుర్గారమేష్, ఉషారాణి తదితరులున్నారు.


