
స్మార్ట్ మీటర్లతో ఉపాధికి గండి
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ మీటరు రీడర్లను రోడ్డున పడేయవద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఆందోళన చేపట్టి, కలెక్టరేట్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మీకోసంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లను నేలకేసి కొట్టి పెడ బొబ్బలు పెట్టిన నారా లోకేష్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని గతంలో సంస్థ సీఎండీ మీటర్ రీడర్స్‌కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఎస్క్రో ద్వారా వేతనాలు ఇవ్వని కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్లలో ఐటీఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్‌గా, వాచ్ అండ్ వార్డ్‌గా నియమించాలని, సర్కిల్ ఆఫీసుల్లో మీటర్ రీడర్స్ అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్‌గా, అటెండర్స్‌గా, వాచ్‌మెన్‌గా నియమించాలని కోరారు. ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్ మీటర్ రీడర్స్‌ను ఉపయోగించుకోవాలని, ఎంఆర్‌టీలో స్కిల్డ్ అండ్ అన్ స్కిల్డ్ వర్కర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. మూడు కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, అదనపు పని గంటలను రద్దు చేయాలని సూచించారు. కార్యక్రమంలో చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, వై.వి.ఆనంద్, ఎం.లక్ష్మిపతి, బి. శ్రీనివాసరావు, పెనుమాక జాకబ్, నెక్కంటి సుబ్బారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.