
ప్రమాదవశాత్తు గోదావరిలో జారిపడి వ్యక్తి మృతి
పెనుగొండ: సిద్ధాంతం వశిష్టా గోదావరిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి జారిపడి మృత్యువాత పడ్డాడు. పెనుగొండ మండలం రామన్నపాలెంకు చెందిన బాలిశెట్టి సురేష్ బాబు (37) పాత ఇనుము వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పాత ఇనుము కొనుగోలు నిమిత్తం బాబాయి సూరిబాబుతో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. సిద్ధాంతం చేరుకొని బహిర్బూమి కోసం ఉదయం 7.30 గంటలకు సిద్ధాంతం గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. సమీపంలో జాలర్లతో వెతికించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 10 గంటలకు సురేష్‌బాబు మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడుకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెనుగొండ ఎస్సై కే గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: నూతన సంవత్సరాది పర్వదినానికి శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక ఉగాది మండపానికి రంగులు వేసే పనులను ప్రారంభించారు. అలాగే మండప పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేష వాహనంపై ఊరేగింపుగా మండపం వద్దకు వెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణము జరుపుతారు. ఆ తరువాత పండిత సత్కారం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి కోరారు.

ప్రమాదవశాత్తు గోదావరిలో జారిపడి వ్యక్తి మృతి