తణుకు అర్బన్ : తణుకు జాతీయ రహదారి శర్మిష్ట సెంటర్‌లో 5 గేదెలతో వెళ్తున్న వ్యాన్‌ను గోసేవాసమితి సభ్యులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్, ఇతర సభ్యులు వ్యాన్‌ను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. వ్యాన్‌లో ఉన్న గేదెలను తేతలి పశువధ శాలకు తీసుకువెళ్తున్నామని, మరలా నూజివీడులో పెంపకానికి తీసుకువెళ్తున్నామని వ్యాన్ డ్రైవరు రెండు రకాల సమాధానాలు చెప్పారని గోసేవా సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదింటిలో పాలిచ్చేవాటితోపాటు సూడి, పెయ్యి కూడా ఉన్నాయని.. పెంపకానికి తీసుకెళితే ఇలా వ్యాన్‌లో ఇరికించరని.. వీటిని వధించే ఫ్యాక్టరీకి తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. గేదెలకు సంబంధించిన వ్యక్తులు మాత్రం పి.గన్నవరం బెల్లంపల్లి గ్రామం నుంచి నూజివీడుకు పెంపకానికి తీసుకువెళ్తున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా ప్రాంతానికి వచ్చిన పోలీసులు వ్యాన్ నుంచి గేదెలను దింపి వాటిని అక్కడే చెట్ల వద్ద ఉంచారు. గేదెలను గోశాలకు పంపిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా 5 గేదెలను ఒక వ్యాన్‌లో ఎక్కించినందుకు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు వ్యాన్‌ను అప్పగిస్తామని తణుకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.