చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి
ఉండి: చర్చి నిర్మాణం కూల్చివేతపై పాస్టర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పాస్టర్ కొయ్యగర్ల దానియేలు దంపతులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి శివారు రామాపురం, పాములపర్రు సరిహద్దులో 13 ఏళ్లగా సీయోను రారాజు ప్రార్థనా మందిరం ఉందని, సుమారు 70 మంది విశ్వాసులతో ప్రార్థనలు జరుపుకుంటున్నామని చెప్పారు. గతేడాది నవంబర్ 7న పాములపర్రుకు చెందిన కూటమి నాయకులు తమకు మాయమాటలు చెప్పి గ్రామాభివృద్ధి కోసం పక్కనే కాలువ కల్వర్టు నిర్మాణం చేయాలంటూ చెప్పి చర్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చర్చి తొలగించేందుకు అనుమతిస్తే రూ.50 వేలు ఇచ్చి, మరో ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇప్పించి, చర్చి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ చర్చి తొలగింపు అనంతరం వారేవరూ పత్తా లేకుండా పోయారని, కనీసం ఫోన్ చేసినా స్పందించేవారు కాదని వాపోయారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు పాములపర్రు గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి గతంలో చర్చి ఉండే పక్కనే ఖాళీస్థలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న చర్చి నిర్మాణం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం ఉండి పంచాయతీ అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది చర్చి నిర్మాణాన్ని కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.
ఉండి శివారు రామాపురంలో ఓ పాస్టర్ దంపతుల ఆవేదన
చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి


