జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాలి
197 జీవో ప్రతుల దహనం
ఏలూరు (టూటౌన్): గ్రామీణ పేదల జీవన విధానాన్ని పూర్తిగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీ జీ రామ్ జీ) బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి 197 జీవో కాపీలను ఏలూరు కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. గతంలో వేతనాలు వంద శాతం కేంద్రమే భరించేదని, ఇప్పుడు రాష్ట్రాలపై 40 శాతం భారం వేయడం వల్ల ఏపీకి సుమారు రూ.5 వేల కోట్ల నిధులు తగ్గి, పథకం అటకెక్కే ప్రమాదం ఉందని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షడు ఏ.రవి, ఎం.జీవరత్నం, జిల్లా నాయకులు లాజర్ మణి, డి.నాగేంద్ర, పి.అనందరావు, జాన్ రాజు, బాలయ్య, సుబ్బారావు, లక్ష్మి, దీవెనమ్మ, ఏసుమణి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే పని దినాల పెంపు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ‘జీ రామ్ జీ’ బిల్లులో 125 రోజుల పని కల్పిస్తామనటం ప్రజలను మభ్యపెట్టడమే అని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిదినాలే కష్టతరంగా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని శ్రీవికసిత్ భారత్ –గ్యారంటీ ఆఫ్ రోజ్ గార్ అండ్ అజీవకా మిషన్ –గ్రామీణ్ శ్రీ(వీబీ –జీ రామ్ జీ)గా పేరు మార్పు, అనేక సవరణలతోపాటు 125 రోజుల పని కల్పిస్తామనటం ప్రజలను మభ్యపెట్టడానికే అన్నారు. ఉపాధి హామీ పథకంలో చెల్లించాల్సిన వేతనాలను ఇప్పటివరకు 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తుండగా.. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లులో 60 శాతం మాత్రమే కేంద్రం భరిస్తామనటం...రాష్ట్రాలపై మరింత భారాన్ని మోపటమే అన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు
ఇరగవరం: ఉపాధి కూలీలతో కలిసి
197 జీవో కాపీలను దహనం చేస్తున్న నాయకులు
ఇరగవరం: ఉపాధి హామీ చట్టం పేరు మార్పు మహాత్మా గాంధీని అవమానపరచడమేనని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతాగోపాలన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్రరావు విమర్శించారు. ఉపాధి కూలీల పొట్ట కొట్టడానికి జారీ చేసిన 197 జీవో కాపీలను శనివారం యర్రాయి చెరువు గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి ప్రజా సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసే సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జుత్తిగ రామాంజనేయులు, పితాని నాగేశ్వరరావు, జుత్తిగ వెంకటలక్ష్మి, పితాని లక్ష్మీ, జుత్తిగ గౌరీ, కుడిపూడి ఆనంద కుమారి, జుత్తిగ కోమలి దుర్గ తదితరులు పాల్గొన్నారు.
జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాలి


