
నిత్యావసరాల పంపిణీలో అవకతవకలపై కఠిన చర్యలు
భీమవరం: నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, ఎండీయు, రేషన్ డీలర్ల అసోసియేషన్, గ్యాస్ డీలర్ల ప్రతినిధులతో జేసీ సమావేశమై నిత్యవసర సరుకులు పంపిణీ, దీపం–2 గ్యాస్ సిలెండర్ల సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన, కచ్చితమైన కొలతలతో నిత్యావసరాలు పంపిణీ జరగాలనే ధ్యేయంతో పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిత్యవసరాల డీలర్లు, ఎండీయు ఆపరేటర్లు వినియోగదారుల నుంచి అదనపు రుసుం వసూలు చేసినా, కొలతలలో తేడా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కొంతమంది అదనపు రుసుం వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి వాస్తవమైతే చర్యలు తప్పవన్నారు.
రైతులకు నోటీసులు అందించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులు అందచేయాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ చాంబర్ లో రీ సర్వే, ఆర్‌ఓఆర్, ఇనాం ఎస్టేట్, ల్యాండ్ గ్రౌండింగ్, వెబ్ ల్యాండ్ తదితర అంశాల పురోగతిపై ఆయన సమీక్షించారు.