సాక్షి, అమరావతి: కోకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు కంపెనీలు కొనుగోలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలు, కోకో రైతుల సంఘాల ప్రతినిధులతో సోమవారం గుంటూరులోని ఉద్యాన శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో కంపెనీల మాయాజాలం వలన తాము ఏవిధంగా నష్టపోతున్నామో పలువురు కోకో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ కోకో రైతు సంఘం ప్రతినిధులు ఎస్.గోపాలకృష్ణ, బొల్లు రామకృష్ణ, కోనేరు సతీష్ బాబు, గుదిబండి వీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజలకు కిలో రూ.700కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో కంపెనీలు మాత్రం కిలో రూ.550–600కు మించి చెల్లించడం లేదన్నారు. గ్రేడింగ్ పేరిట అడ్డగోలుగా ధర తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. వర్షాకాలపు పంట(అన్ సీజన్ ) కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయడం లేదని, ఫలితంగా రైతులు వద్ద పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి సీజన్, అన్ సీజన్ కోకో గింజలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కంపెనీలు తగిన ధర ఇవ్వకపోతే వ్యత్యాసపు ధరను రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుని కోకో రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీంను కోకో రైతులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ కే.శ్రీనివాసులు మాట్లాడుతూ కోకో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి