
సచివాలయం.. సేవలు నిర్వీర్యం
ఆదివారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఏలూరు (టూటౌన్): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ప్రజల వద్దకు పాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ మనుగడపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సచివాలయాల పరిస్థితి చూస్తే ఇది అర్థమవుతుంది. సచివాలయాల సేవలకు క్రమంగా ప్రజలు దూరమవుతున్నారు. గతంలో 139 రకాల సేవలను సచివాలయాల ద్వారా అందించగా ప్రస్తుతం 75 శాతానికి పైగా సేవలు దూరమయ్యాయి.
వైఎస్సార్‌సీపీ మానస పుత్రికగా..
గతంలో ప్రజలు చిన్నపాటి సేవలకు సైతం మండల కేంద్రం, మున్సిపల్ కార్యాలయం, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారికి వ్యయప్రయాసలు తప్పేవి కావు. ఈ నేపథ్యంలో ప్రజల ముంగిళ్లలోకే సేవలందించేలా 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా సేవలందించింది. దీనిపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రతి సచివాలయంలో 11 మంది వరకు సిబ్బందిని నియమించి సుమారు 139 రకాల సేవలు స్థానికంగా అందించేలా చర్యలు తీసుకుంది. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగార్థులకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి సర్టిఫికెట్లు, రైతులకు రిజిస్ట్రేషన్ సేవలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు, ఆధార్ సేవలు, పింఛన్ల నమోదు తదితర సేవలు నిరంతరంగా సాగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
నాడు కళకళ.. నేడు వెలవెల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో నామమాత్రంగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బందిని ఇతర పనులకు వినియోగిస్తుండటంతో సచివాలయంలో గ్రామ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ వంటి వారు మాత్రమే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు అత్యవసరమైన ఆధార్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆపార్ కార్యక్రమంలో అప్‌డేట్ చేస్తుండటం, విద్యార్థుల ఆధార్, స్కూల్ రికార్డుల్లోని వివరాల్లో తేడాలు ఉండటంతో వాటిని సరిచేసేందుకు తల్లిదండ్రులు దూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.
క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతూ..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం సచివాలయాలు 1,145 ఉండగా వీటి పరిధిలో 9,555 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాస్థాయిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వ హణాధికారి మానిటరింగ్ అధికారిగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కమిషనర్, మండల స్థాయిలో మండల పరిషత్ అధికారి సచివాలయాలను అజమాయిషీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ సమర్థవంతంగా పనిచేసిన సచివాలయాలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతుండటం సచివాలయ ఉద్యోగుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. కొందరిని వారి మాతృ సంస్థలకు పంపుతారనే వార్తలు వస్తుండటంపై ఉద్యోగుల్లో నిర్లిప్తత కనిపిస్తోంది.
న్యూస్‌రీల్
గ్రామ స్వరాజ్యంపై కూటమి కక్ష
సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యపు నీడలు
నిర్వీర్యానికి ప్రభుత్వం ఎత్తుగడలు
అలంకారప్రాయంగా కార్యాలయాలు
నామమాత్రంగా సిబ్బంది హాజరు
గతంలో 139 సేవలు.. ప్రస్తుతం 75 శాతం సేవలు రద్దు
అన్ని సేవలూ అందించాలి
గతంతో సచివాలయాల ద్వారా ప్రజలకు అందించిన అన్ని సేవలను ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నూ అందించాలి. సచివాలయ వ్యవస్థ వచ్చిన త ర్వాత సంక్షేమ పథకాల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే బాధలు త ప్పాయి. అర్హత ఉండి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు అందించారు. దీని వల్ల ఎందరో పేదలు లబ్ధి పొందారు.
– కింజంగి రాజు,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ సంఘం, ఏలూరు
పటిష్టం చేయాలి
గతంలో మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయాలను పటిష్టం చేయాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అన్నిరకాల సేవలను యథావిధిగా కొనసాగించాలి. ప్రజల వద్దకే పాలన, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి. ఇటీవల సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయగా.. కొన్నిచోట్ల ఖాళీలు ఉన్నాయి. నిత్యం ఆధార్ అప్‌డేట్‌కు సచివాలయాల్లోనూ అవకాశం కల్పించాలి.
– డాక్టర్ మెండెం సంతోష్ కుమార్,
రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం, ముప్పవరం

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

సచివాలయం.. సేవలు నిర్వీర్యం