
ఆదర్శ పాలన అందించాం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రెండేళ్లలో కరోనా విపత్తు ఉందని, అనంతరం మూడేళ్లు జనరంజక పాలన అందించామని మాజీ ఉప ముఖ్యమంత్రి, కొట్టు సత్యనారాయణ అన్నారు. కరోనా కాలంలోనూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు అండగా నిలుస్తామని, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళతామన్నారు. నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నామని, ప్రజలందరికీ న్యాయం చేయాలనే తపనతోనే ఉన్నామన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్‌కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కొట్టుపై వ్యాఖ్యలు చేయడం కూటమి సభ్యుడు వలవల మల్లికార్జునరావు స్థాయికి తగదన్నారు. ఆయన స్థాయిని మరి చి విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో కొట్టు ద్వారానే ఆయన రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలర్‌గా గెలుపొందారని గుర్తు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ స్థలాలను ఆక్రమంచి దుకాణ సముదాయాలను నిర్మించి కోట్లతో దండుకున్నారని ఆరోపించారు. దుకాణ సముదాయాలను తొలగించాలని హైకోర్టు తీర్పు కూడా ఇచ్చిందన్నారు. సంపతరావు కృష్ణారావు మాట్లాడుతూ మంత్రిగా కొట్టు హయాంలో నియోజకవర్గంలో రూ.1,100 కోట్లతో అభివృద్ధి పనులు చేశారన్నారు. కొన్ని పనులు పూర్తవగా, మరికొన్ని కొనసాగుతు న్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నేతలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కర్రి భాస్కరరావు, బండారు నాగు, చెన్నా జనార్దన్, మానికొండ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.