సార్వా సాగుకు సన్నద్ధం | Sakshi
Sakshi News home page

సార్వా సాగుకు సన్నద్ధం

Published Mon, May 20 2024 3:50 AM

సార్వ

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో రైతన్నలు సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో దాళ్వా వరి పంట మాసూళ్లు 90 శాతం పైగా పూర్తికావడంతో రైతులు సార్వా సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేకమంది రైతులు వరి నారుమళ్లకు దుక్కులు ప్రారంభించారు. మిగిలిన ప్రాంతాల్లో పొలాల్లోని ఎత్తు, పల్లాలను సరిచేయడం, మెట్టదుక్కులు చేయడం, గట్టు లంకలు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,11,256 ఎకరాల్లో సార్వా వరినాట్లు వేయాల్సివుండగా దీనికి అనుగుణంగా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులతో ముందుగా నాట్లు వేయించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంలో రైతులను ప్రోత్సహించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత సార్వా సీజన్‌కు అనుకూలంగా ఎంటీయూ 1318, స్వర్ణ రకాలు మేలైనవని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.

మట్టి నమూనాల సేకరణ

వరినాట్లు వేసే భూముల్లో వంగడాలకు అనువుగా ఎరువులు వేసుకోవాలి. రైతులు విచ్చల విడిగా ఎరువులు వాడడం వల్ల ఖర్చులు పెరగడమే గాక పంట తెగుళ్ల బారిన పడుతోంది. భూములకు అనుగుణంగా ఎరువులు వాడుకోడానికి ముందుగా భూసార పరీక్షలు నిర్వహించడానికి మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత పంట కాలానికి జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. రైతు భరోసా కేంద్రాల వారీగా నమూనాలు సేకరించి తాడేపల్లిగూడెంలో భూసార పరీక్షలు నిర్వహించి వాటి వివరాలను రైతులకు అందచేస్తారు. భూసార పరీక్షలను బట్టి ఎరువులు వాడుకోవచ్చు.

ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు సిద్ధం

జిల్లాలో సుమారు 47వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా ఎక్కువశాతం రైతులు సేకరించుకోవడం పరిపాటి. అయినప్పటికీ ఆర్‌బీకేల్లో 1,800 క్వింటాళ్ల విత్తనాలను కిలో రూ.5 రాయితీపై సరఫరా చేయడానికి సిద్ధం చేస్తున్నారు. 58,905 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 20 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోడానికి, ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పధకాలను అందిపుచ్చుకోడానికి ఈ క్రాప్‌ బుకింగ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి.

పొలం బడితో రైతులకు అవగాహన

సార్వా వరి సాగులో రైతులు విచక్షణారహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా పొలం బడి పేరుతో రైతులకు సమావేశాలు నిర్వహించి పెట్టుబడులు శాసీ్త్రయంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 95 రైతు భరోసా కేంద్రాల పరిధిలో పొలం బడి నిర్వహిస్తారు.

అంతా సన్నద్ధం

జిల్లాలో సార్వా సీజన్‌కు పూర్తి ప్రణాళిక సిద్ధం చేశాం. సుమారు 2.11 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సివుండగా అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేస్తున్నాం. రైతులు ముందుగా నాట్లు వేసుకుని అవసరం మేరకు ఎరువులు వాడుకోవడంతో పెట్టుబడి ఖర్చులు తగ్గడమేగాక అధిక దిగుబడులు సాధించవచ్చు.

– జెడ్‌.వెంకటేశ్వరరావు,

జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం

జిల్లాలో 2.11 లక్షల ఎకరాల్లో వరి సాగు

1,800 క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా

ఇప్పటికే 20 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధం

సార్వా సాగుకు సన్నద్ధం
1/1

సార్వా సాగుకు సన్నద్ధం

Advertisement
 
Advertisement
 
Advertisement