పాలకొల్లులో ‘మినీ ముంబై’ | Sakshi
Sakshi News home page

పాలకొల్లులో ‘మినీ ముంబై’

Published Sun, Dec 3 2023 1:00 AM

దుకాణాలు, కొనుగోలుదారులతో కిక్కిరిసిన మార్కెట్‌ హాలు 
 - Sakshi

సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు, పరిసరాల్లోని భగ్గేశ్వరం, దగ్గులూరు, లంకలకోడేరు, దిగమర్రు, పెనుమర్రు, బల్లిపాడు, ఆచంట వేమవరం గ్రామాల్లో పూర్వం నేత కార్మికులు ఎక్కువగా ఉండేవారు. బ్రిటీష్‌ హయాంలో వీరు తయారుచేసిన నేత చీరలు, తలపాగాలు తదితర వాటిని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్న దేవునిహాలులో విక్రయించుకునే వారు. అప్పట్లోనే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి వీటిని కొనుగోలు చేసుకుని తీసుకువెళ్లేవారు. కాలక్రమంలో వస్త్ర రంగంలో మిల్లుల రాకతో చేనేత కార్మికులకు పని తగ్గిపోయింది. సరుకును మార్కెట్‌కు తెచ్చి విక్రయించే నేత కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ అప్పటికే మార్కెట్‌కు మంచి గుర్తింపు రావడంతో మిల్లు వస్త్రాలు తెచ్చి విక్రయించే వ్యాపారులు పెరిగారు. 2015 గోదావరి పుష్కరాల వరకూ ఆలయం దక్షిణ భాగంలో ఉన్న దేవునిహాలులో మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఓ నాలుగేళ్లు స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణలో కొనసాగించారు. ప్రస్తుతం పాలకొల్లు–నర్సాపురం కెనాల్‌ రోడ్డులో వ్యాపారులు దేవునిహాలు పేరున శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ పేరిట ప్రత్యేకంగా హాల్‌ను నిర్మించుకున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాల్లా కాకుండా సంతను తలపించేలా బ్లాగు (ఖానా)లుగా ఏర్పాటుచేసుకున్నారు. ఈ హాల్‌లో మొత్తం 112 బ్లాగులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం స్థానికులతో పాటు వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధిచెందిన రాజమహేంద్రవరం, ద్వారపూడి, మాచవరం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి వ్యాపారాలు సాగిస్తుంటారు. ఈ మార్కెట్‌పై ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

అన్ని వైరెటీలు లభ్యం

ఇక్కడ దొరకని దుస్తులంటూ ఉండవు. చిన్నారుల నుంచి పెద్దల వరకు, లో కాస్ట్‌ నుంచి హై కాస్ట్‌ వరకు ఉంటాయి. ప్రసిద్ధి చెందిన కంచి, బెనారస్‌, ధర్మవరం, ఉప్పాడ పట్టుచీరలు, కాటన్‌, సిల్స్‌, పార్టీ వేర్‌ చీరలు, క్లాత్‌, రెడీమేడ్‌ దుస్తులు, డ్రెస్‌ మెటీరియల్స్‌, బ్లౌజ్‌లు, పంచెలు తదితర వాటిని వ్యాపారులు హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్మకాలు చేస్తుంటారు. గురువారం రాత్రి ఆయా ప్రాంతాల నుంచి వ్యాపారులు సరుకుతో మార్కెట్‌కు చేరుకుని శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటలకే షాపులను సిద్ధం చేసుకుంటారు. ఇక్కడ హోల్‌సేల్‌గా దుస్తులు కొనుగోలు చేసి బయట విక్రయించుకునే చిరు వ్యాపారులు చాలావరకు తెల్లవారుజాము సమయంలో కొనుగోలు చేసుకుని వెళ్లిపోతుంటారు. ఉదయం నుంచి అధిక శాతం రిటైల్‌ వ్యాపారం జరుగుతుంది. పాలకొల్లు, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు వస్తుంటారు. సాయంత్రం సమయానికి మార్కెట్‌ మూతపడిపోతుంది. బయటి మార్కెట్‌తో పోలిస్తే ధరలు కొంచెం తక్కువగానే ఉంటున్నాయని కొనుగోలుదారులు తెలిపారు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రభావం తక్కువే

మాల్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వచ్చాక వస్త్ర వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి. ఈ ప్రభావం సంత మార్కెట్‌పైనా పడినప్పటికీ వారానికి ఒక్కరోజే కావడంతో ఈ మార్కెట్‌కు ఆదరణ తగ్గలేదు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో మార్కెట్‌ కిక్కిరిసి ఉంటుంది. జనం రద్దీని బట్టి ఆ సమయంలో రాత్రి వరకు అమ్మకాలు చేస్తుంటారు. ఒక్కో షాపులో రూ.30 వేలు నుంచి రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుందని అంచనా.

సాధారణంగా సంత మార్కెట్‌ అంటే కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇతర అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు సరుకులు తెచ్చి విక్రయిస్తుంటారు. అయితే పాలకొల్లులో వినూత్నంగా కేవలం దుస్తులు మాత్రమే విక్రయించే సంత మార్కెట్‌ ఉంది. ప్రతి శుక్రవారం జరిగే ఈ సంత మార్కెట్‌లో రూ.కోటికి పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. మినీ ముంబైగా ప్రసిద్ధి చెందిన ఈ ఫ్రైడే డ్రెస్‌ మార్కెట్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది.

ఫ్రైడే డ్రెస్‌ మార్కెట్‌

పాలకొల్లులో ప్రత్యేక దుస్తుల వారపు సంత

శుక్రవారం ఒక్కరోజే నిర్వహణ, ఎన్నో ఏళ్ల చరిత్ర

ఒకే హాల్లో 112 దుకాణాలు, రూ.కోటి టర్నోవర్‌

దూర ప్రాంతాల నుంచి వస్తున్న

వ్యాపారులు, కొనుగోలుదారులు

అందుబాటులో అన్ని రకాల దుస్తులు

పాలకొల్లులోని ఫ్రైడే సంత మార్కెట్‌ ప్రాంగణం
1/3

పాలకొల్లులోని ఫ్రైడే సంత మార్కెట్‌ ప్రాంగణం

మార్కెట్‌లో ఓ దుకాణం
2/3

మార్కెట్‌లో ఓ దుకాణం

3/3

Advertisement
 
Advertisement