 
															చెరువుల్లా రోడ్లు.. ప్రజలకు పాట్లు
చేపలకు గాలం వేస్తూ వైఎస్సార్‌సీపీ నిరసన
ఏలూరు టౌన్: తాము అధికారంలోకి వస్తే రోడ్లన్నీ తళతళా మెరిపిస్తామంటూ కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా హామీలు తీరే ‘దారి’ కానరావడం లేదు. ఏలూరులోని 18వ డివిజన్ వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ కేదారేశ్వరి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్‌టీయూసీ నగర అధ్యక్షు డు ఘంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ నేతలతో కలిసి రోడ్డు గుంతల్లో చేపలు పట్టేందుకు గాలం వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జే పీ మాట్లాడుతూ కూటమి నేతలకు ప్రజలు పడు తున్న కష్టాలు కనిపించటం లేదనీ, 18 నెలలుగా గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయటాన్ని ప్రజలు హర్షించరన్నారు. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టకుంటే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్ళేందుకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
