మోంథా.. గుండెకోత | - | Sakshi
Sakshi News home page

మోంథా.. గుండెకోత

Oct 31 2025 12:54 PM | Updated on Oct 31 2025 12:54 PM

మోంథా.. గుండెకోత

మోంథా.. గుండెకోత

రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం స్పందించాలి మొత్తం మునిగింది పెట్టుబడి వచ్చేలా లేదు 50 శాతం పంట నష్టం

వ్యవసాయ శాఖ

ప్రాథమిక అంచనా (ఎకరాల్లో..)

సాక్షి, భీమవరం: జిల్లాలోని రైతులు 2.15 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం ప్రాంతంలో పీఆర్‌ 126, విత్తనం కోసం సాగుచేసిన ఎంటీయూ 1,121 స్వల్పకాలిక రకాలకు సంబంధించి 5,600 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. 8,878 ఎకరాలు కోత దశకు చేరుకున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో 11,406 ఎకరాల్లోని పంట పొట్టపై ఉండగా, 97,342 ఎకరాలు పూత దశ, 61,958 ఎకరాలు పాలుపోసుకునే దశ, 29,884 ఎకరాలు గింజ గట్టిపడే దశల్లో ఉన్నాయి. వచ్చేనెల రెండో వారం నుంచి జిల్లావ్యాప్తంగా వరి కోతలు మొదలుకానున్నాయి.

ముంచిన మోంథా : పాలు పోసుకోవడం నుంచి గింజ గట్టిపడే దశలు అత్యంత కీలకంగా భావిస్తారు. ఈ తరుణంలో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కురిసిన వర్షాలు వరి పంటకు తీవ్ర నష్టం కలిగించాయి. 10,309 ఎకరాల పంట నీట మునగ్గా, 16,072 ఎకరాల్లోని పంట నేల వాలినట్టు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయి సర్వేలో ఈ నష్టం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో వరి పంట నేలకొరిగింది. వీటితో పాటు అధికంగా సాగై ప్రస్తుతం పూతపై ఉన్న ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలు శాతం పెరిగి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు అంటు న్నారు. ఎక్కడికక్కడ రైతులు పొలాల్లో పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముంపు నీటిని బయటకు పంపేందుకు బాటలు చేసుకోవడం, నేలనంటిని చేలను పైకి నిలబెట్టి కట్టలుగా కట్టుకోవడం చేస్తున్నారు. మరికొందరు వ్యవసాయ అధికారులు వచ్చి పంట నష్టం పరిశీలించిన తర్వాత నష్టనివారణ చర్యలు చేపట్టాలని పొలాల వద్ద వేచి చూడటం కనిపించింది. తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, ఆచంట తదితర చోట్ల పలువురు రైతులు మాట్లాడుతూ పంట నేలనంటడంతో యంత్రాల ద్వారా కోత సాధ్యం కాదని, కూలీలతో కోయిస్తే చాలా ఖర్చవుతుందని వాపోయారు. 40 శాతం మేర దిగుబడి తగ్గిపోయి పంట పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టామని అంటున్నారు.

నాలుగెకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. తుపాను వల్ల పంట పడిపోయింది. నీరు బయటకు లాగకుండా చేలోనే నిలబడిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– సలాది తారకం, కౌలు రైతు, కాళ్ల

ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టాం. వర్షం కంటే కూడా గాలులు ఎక్కువగా ఉండటంతో పూత మొత్తం రాలిపోయింది. దిగుబడి మొత్తం తగ్గిపోతుంది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలి.

– దిరిసిపో జ్యోతులు, కౌలు రైతు, రేలంగి

వ్యవసాయంపై ఇష్టంతో 21 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పంట చేతికి అందుతుంది. ఊహించని విధంగా తుపానుతో 9 ఎకరాల్లోని స్వర్ణ రకం పంట మొత్తం నీట మునిగిపోయింది.

– గంధం రాంబాబు, కౌలు రైతు, రాయకుదురు

ఈ ఏడు సార్వాలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. నాట్ల సమయంలో ఒకసారి, పంట చేతికి అందే సమయంలో మరోసారి భారీ వర్షాలు నష్టం కలిగించాయి. ఈసారి పంట దిగుబడి తగ్గి పెట్టుబడులు వచ్చే దారి కనిపించడం లేదు.

– తాటిపర్తి చిన్నారావు, కౌలురైతు రావిపాడు

రావిపాడులో 1,900 ఎకరాల భారీ ఆయకట్టు ఉంది. 30 శాతం పంట నేలనంటినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నా.. సుమారు 50 శాతానికి పైగానే పంట నష్టపోయాం. ఎన్యూమరేషన్‌లో రైతులకు న్యాయం చేయాలి.

– కై గాల గణపతి, రావిపాడు సొసైటీ మాజీ అధ్యక్షుడు

మండలం వరి నీట నేల

సాగు మునిగింది వాలింది

ఆచంట 10,080 80 500

ఆకివీడు 4,019 1,285 50

అత్తిలి 14,025 0 1,550

భీమవరం 5,914 3,297 43

గణపవరం 11,739 45 1,805

ఇరగవరం 13,978 300 1,450

కాళ్ల 3,780 2,087 0

మొగల్తూరు 626 335 0

నరసాపురం 6,567 1,950 196

పాలకొల్లు 9,584 0 1,035

పాలకోడేరు 11,104 163 432

పెంటపాడు 21,453 0 2,244

పెనుగొండ 11,829 0 1,390

పెనుమంట్ర 12,207 0 720

పోడూరు 13,027 51 1,106

తాడేపల్లిగూడెం 24,964 0 1,725

తణుకు 11,869 112 761

ఉండి 10,811 154 360

వీరవాసరం 11,948 150 500

యలమంచిలి 5,544 300 205

నిండా ముంచేను

చి‘వరి’లో పంటపై పంజా

పది రోజుల్లో ఖరీఫ్‌ కోతలు

ఇప్పటికే ఎకరాకు రూ.25 వేలకు పైగా పెట్టుబడి

ప్రాథమిక అంచనా మేరకు 26,381 ఎకరాల్లో నష్టం

సర్వేలో నష్టం భారీగా పెరుగుతుందని అంచనా

దిగుబడులపై రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement