 
															ఆక్వా రంగానికి తీవ్ర నష్టం
వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి 
సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌తో ఆయన మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తే 40 శాతం వరకూ ఇప్పటికే పడిపోగా తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నరసాపురం తీరంలోనే తుపాను తీరం దాటడం వల్ల పల్లపు ప్రాంతాల్లో ఉన్న రొయ్యల చెరువులన్నీ దెబ్బతిన్నాయని, నీరు పైకి లేచి రెండు మూడుసార్లు ఉప్పెనలా వచ్చి సుమారు 1,200 ఎకరాల్లో రొయ్యల చెరువులు డ్యామేజీ అయ్యాయన్నారు. హార్టికల్చర్ గా నీ, కూరగాయలు గానీ ఆచంట నియోజకవర్గ పరిధిలో 1,000 నుంచి 1,500 ఎకరాలకు పైగా లంక గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. గాలి విపరీతంగా రావడం వల్ల పంటలు నేలవాలాయని, తాడేపల్లిగూడెంలో 10 వేల ఎకరాల్లో పంట చేతికొచ్చే సమయంలో గాలులు రావడం వల్ల పడిపోయిందని చెప్పారు. వరి చేలకు, ఆక్వాకు సంబంధించి నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దెబ్బతిన్నాయని, ఆక్వాకు సంబంధించి రెండు మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల రైతులు జనరేటర్ల మీద కంటిన్యూ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారని ప్రసాదరాజు అన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
