 
															రైతులు జాగ్రత్తలు పాటించాలి
పాలకొల్లు సెంట్రల్: తుపాను వల్ల నష్టపోయిన రైతులు వరి పంటలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు పాలడుగు సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని లంకలకోడేరు, వెదుల్లపాలెం, వెంకటాపురం గ్రామాల్లో పంట నష్టాలను ఆయన పరిశీలించారు. గోదావరి మండలాల్లో 4.15 లక్షల హెక్టార్లలో సార్వా వరి సాగవుతోందన్నారు. పంట ఎక్కువగా పూత, పాలు పోసుకునే దశ నుంచి కోత దశ వరకూ ఉందన్నారు. అధిక వర్షాలతో పాలుపోసుకునే దశలో ఉన్న స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు చేను పడి నీట మునిగే అవకాశం ఉందన్నారు. వీటితో పాటూ గోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100 రకాలు సాగు చేస్తున్నారన్నారు. ఇవి పూత దశలో ఉన్నప్పుడు వర్షం కురిస్తే సంపర్కం సరిగా జరగక తాలు గింజలు ఏర్పడతాయన్నారు. అలాగే ఎంటియు 1318 వంటి రకాలలో గొలుసుకట్టు దగ్గరగా ఉండటం వల్ల గింజలు రంగు మారడం, మానిపండు తెగు లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. నిరంతరం వర్షాల వల్ల గింజల్లో నిద్రావస్థ తొలిగి మొలక వచ్చే అవకాశం ఉందన్నారు. బాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగులు వ్యాపించే ప్ర మాదం ఉందన్నారు. నిద్రావస్థ లేని బీపీ 5204, పీఎల్‌ఏ 1100 రకాల్లో గింజలు వెంటనే మొలకెత్తే అవకాశం ఉంటుందని, నష్టనివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
