 
															చివరిలో ఇలా చేస్తే మేలు
పంట నష్ట నివారణకు శాస్త్రవేత్త సూచనలు 
సాక్షి, భీమవరం: మోంథా తుపాను నేపథ్యంలో పంట నష్టం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరించారు. ఆయన సూచనలు..
● వీలైనంత వరకు పొలంలో నిలిచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ఎక్కువ నీరు నిలిచిన చోట పెద్ద కాలువలు ఏర్పాటు చేసి మోటార్ల ద్వారా తొలగించే ప్రయత్నం చేయాలి.
● గింజలు రంగుమారడం, మాగుడు, మానిపండు తెగులు వ్యాపించకుండా ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రోపికొనజోల్ పిచికారీ చేయాలి.
● వర్షాలు తగ్గిన తరువాత బ్యాక్టీరియా, ఎండాకు తెగులు కనిపిస్తే లీటరు నీటికి 1 మిల్లీలీటరు ప్లాంటోమైసిన్ కలిపి, లీటరునీటికి 2 గ్రాముల కొసైడ్ (కాపర్ హైడ్రాకై ్సడ్) కలిపి పిచికారీ చేయాలి.
● తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్లను ఉపయోగించుకోవాలి.
● నిలిచి ఉన్న లేదా పడిపోయిన చేలలో కంకిపై గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం (లీటరు నీటికి 50 గ్రాముల కల్లు ఉప్పు కలిపి) పిచికారీ చేయాలి.
● నూర్చిన ధాన్యం 2–3 రోజులు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమేగాక రంగుమారి చెడువాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్వింటాలు ధాన్యానికి కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండుగడ్డి కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల వారం రోజులపాటు గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా ఉంటుంది. ఎండకాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిల్వచేసుకోవాలి.
● రైతులు ఇంకా సందేహాలుంటే.. గోదావరి డెల్టా ప్రధాన శాస్త్రవేత్త (వరి) డాక్టర్ ఎం.గిరిజారాణిని 9490195904 ఫోన్ నంబరులో వాట్సాప్ ద్వారా సంప్రదించాలి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
