
మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు (ఫైల్)
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి వచ్చే నెల 9 వరకు ధర్మప్రచార మాసోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ ధర్మాదాయ శాఖ, ధర్మప్రచార పరిషత్, శ్రీవారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల్ వలవన్, శాఖ కమిషనర్ రాము సత్యన్నారాయణ తదితరులకు ఈఓ వేండ్ర త్రినాథరావు మంగళవారం అందజేశారు.
ఉత్సవాలు జరిగేదిలా..
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు శ్రీవారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాట భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ధర్మప్రచార రథాన్ని మంత్రి ప్రారంభిస్తారు. 11.30 గంటలకు ధర్మప్రచార పరిషత్ – ధార్మిక సభను ఘనంగా ప్రారంభిస్తారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
ఉత్సవాల ప్రారంభం అనంతరం క్షేత్రంలో నూతనంగా రూ.5.32 కోట్లతో నిర్మించిన 1 మెగావాట్ సోలార్ ప్లాంట్‌ను మంత్రి కొట్టు ప్రారంభిస్తారు. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో రూ. 10.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అనివేటి మండపం ఫేజ్–2 శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. శివాలయం వద్ద రూ.3.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి, రూ.1.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రూఫ్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే తలారితో పాటు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి తదితరులు పాల్గొంటారని ఈఓ త్రినాథరావు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రి కొట్టు