
నూజివీడు(ఆగిరిపల్లి): ఆగిరిపల్లిలో వినాయకుడి నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక వ్యక్తి దాడి చేసి తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలోని వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి స్టేషన్‌కు చెందిన గంధం నరేంద్ర(32) బందోబస్తుకు వెళ్లారు. ఊరేగింపు అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో డీజే లు పెట్టి డ్యాన్స్‌లు వేస్తూ ఆలస్యం చేస్తుండటంతో కానిస్టేబుల్ త్వరగా ముందుకు వెళ్లండి అని చెప్పాడు.
దీంతో అక్కడే డ్యాన్స్ చేస్తున్న ఉలాస రామకృష్ణ(27) మద్యం మత్తులో కానిస్టేబుల్ నరేంద్ర తలపై శ్లాబ్‌కు వాడే బాదుతో దాడి చేసి బలంగా కొట్టడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మెదడులో గాయమైనట్లు చెబుతున్నారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడుకు చెందిన నరేంద్ర 2018లో కానిస్టేబుల్‌గా నియమితులై చాట్రాయి పోలీసుస్టేషన్‌లో జాయినయ్యాడు.
అక్కడ ఐదేళ్లు పూర్తికావడంతో మూడు నెలల క్రితమే చాట్రాయి నుంచి ఆగిరిపల్లికి బదిలీఅయ్యాడు. నరేంద్రకు భార్య, మూడేళ్ల కుమారుడు, 9 నెలల కుమార్తె ఉన్నారు. కానిస్టేబుల్ ఉన్న విజయవాడ ఆసుపత్రికి ఏలూరు జిల్లా ఎస్పీ డీ మేరీ ప్రశాంతి ఆదివారం వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు. ఎస్పీ వెంట నూజివీడు డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్ గౌడ్ ఉన్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
దాడిపై చేసిన నిందితుడు ఉలాస రామకృష్ణ(27)ను పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు జడ్జి సెలవులో ఉండటంతో తిరువూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.

గంధం నరేంద్ర