
గంజాయి స్వాఽధీనం, నిందితుల అరెస్టును చూపుతున్న సీఐ మూర్తి, ఎస్సై సత్యనారాయణ
ముగ్గురు వ్యక్తులు, ఒక బాలుడు అరెస్టు
పెంటపాడు: అలంపురం హైవే రోడ్డులో 22.500 కేజీల గంజాయి బాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను, ఒక బాలుడిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలను తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎస్వీఎస్‌ఎస్ మూర్తి పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వెల్లడించారు. ఈనెల 28న మధ్యాహ్నం అలంపురం హైవే రోడ్డులో గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో పెంటపాడు ఎస్సై జి.సత్యనారాయణ, తహసీల్దార్ జీవీ శేషగిరిరావు, సీఐ మూర్తి సిబ్బంది దాడి చేశారు. విశాఖపట్నం జిల్లా రైల్వే గూడ్సు వాగన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొని అమ్మకానికి తీసుకొస్తున్న రూ.33,750 విలువ గల 22.500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. నిందితులు మానుకొండ రాజేష్ (చేబ్రోలు) ఇంజమూరి వినయ్ (భీమవరంలోని దుర్గాపురం), మల్లుల వెంకటేశ్వరరావు (గణపవరం మండలం జల్లికాకినాడ)తో పాటు మరో బాలుడుని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్, భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్‌ల ఆదేశాల మేరకు నిందితులను కోర్టుకు తరలించనున్నట్టు సీఐ మూర్తి తెలిపారు. దాడికి సహకరించిన పోలీసులు కె.సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, ఎం.శివరామకృష్ణలను సీఐ అభినందించారు.
ఆక్వా పార్సిల్ వ్యాన్ బోల్తా
మండవల్లి: మండవల్లి మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామం నుంచి ఉనికిలి వెళ్తున్న ఆక్వా పార్శిల్ వ్యాన్ బుధవారం ఉనికిలిలోని ఉమ్మడి బద్దల సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇటీవల గుడివాడ ఆర్టీసీ బస్ తిరగబడిన స్థానంలోనే ఈ వ్యాన్ బోల్తా కొట్టడం విశేషం.