దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన మాసంపల్లి సాయితేజ జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో నిర్వహించనున్న క్రికెట్ మ్యాచ్‌కు సిద్ధం కావడానికి తనకు క్రికెట్ కిట్ అందించాలని విజ్ఞప్తి చేశాడు. ‘జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు సాయితేజ’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఎంజేపీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి సైదులు స్పందించారు. సాయితేజకు క్రికెట్ కిట్ సమకూర్చి వరంగల్ ఆర్‌సీఓ రాజ్‌కుమార్ ద్వారా అందజేశారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల నరేశ్, రాజేంద్రప్రసాద్, రాజేందర్ పాల్గొన్నారు.
జీపీఎస్‌ఏపీ పథకానికి
మూడు గ్రామాల ఎంపిక
చెన్నారావుపేట: గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీఎస్‌ఏపీ) పథకానికి జిల్లాలోని మూడు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు డీఆర్‌డీఓ నాగపద్మజ తెలిపారు. చెన్నారావుపేట మండలంలో జోజిపేటనారాయణతండా, రాయపర్తి మండలంలో రాగన్నగూడెం, సంగెం మండలంలో కాపులకనపర్తి గ్రామాలను ఎంపిక చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో త్వరలోనే ప్రజల అవసరాలను గుర్తించి, అవగాహన కల్పించి అవకాశం మేరకు పనులు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
క్షయ నిర్మూలనకు కృషిచేయాలి
నర్సంపేట రూరల్: క్షయ నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ బ్లెస్సీ ఈస్టర్, జిల్లా ఎన్‌టీఈపీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్ జోషి సూచించారు. క్షయవ్యాధి నిర్మూలనపై నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులను నిక్షయ్ మిత్రులుగా నియమించి రోగులకు అవగాహన కల్పించాలన్నారు. కళాశాలలో ఒక మొబైల్ ఎక్స్‌రే యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, డాక్టర్ పూనంకుమార్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుజాత, డాక్టర్ ఉషారాణి, పద్మజ, విజయ్‌కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్షలు
కాళోజీ సెంటర్: జాతీయ విద్యావిధానం–2020, నిపుణ్ భారత్‌మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ నెల 25 నుంచి 27 వరకు అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఒ బి.రంగయ్యనాయుడు తెలిపారు. జిల్లాలోని 324 ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 14,944 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో నిర్వహించచనున్నట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యసనస్థాయిని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కచ్చితంగా అంచనా వేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థుల సమాధానాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయడం ద్వారా ఫలితాలు వెంటనే రాష్ట్రస్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పరీక్షల అనంతరం విద్యార్థుల అభ్యసన స్థాయిని బట్టి ప్రత్యేక రెమిడియల్ బోధన కార్యక్రమాలు చేపట్టి, ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా కార్యాచరణ రూపొందించనునున్నట్లు తెలిపారు. 100 శాతం మంది విద్యార్థుల హాజరు ఉండేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి మొబైల్ యాప్ ద్వారా పరీక్ష పూర్తి చేయించాలని ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


