నెక్కొండ: సివిల్ వివాదంలో జోక్యం, పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని కారణంగా నెక్కొండ ఎస్సై మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గాడ్దుల వెంకన్న.. నెక్కొండ తండాకు చెందిన బోడ అనిల్, బానోతు వాగ్యాకు రూ.50 వేలు గొర్రెల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా వెంకన్నకు చెందిన 90 గొర్రెలు, మేకలను వీరు తోలుకెళ్లారు. దీంతో వెంకన్న పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అనిల్, వాగ్యాకు అనుకూలంగా ఎస్సై వ్యవహరించి తాను చెప్పినట్లు వినాలని, లేదంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేస్తానని వెంకన్నను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. తన జీవాలను ఇప్పించాలని, విచారణ చేపట్టి ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని నర్సంపేట ఏసీపీ, డీజీపీకి వెంకన్న ఇటీవల ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ భూవివాదంలో ఎస్సై మితిమీరిన జోక్యం చేసుకున్నాడని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. శాఖాపరమైన విచారణ చేపట్టగా ఎస్సైపై ఆరోపణలు ప్రాథమికంగా నిజమని తేలినట్లు సమాచారం. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు ఎస్సైని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో అప్పడు ఎస్సై చైతన్యచందర్, ఇప్పుడు మహేందర్ సస్పెండ్ కావడం మండలంలో కలకలం రేపింది.
వరంగల్ పోలీస్ కమిషనర్
శ్వేత ఉత్తర్వులు జారీ
సివిల్ వివాదంలో ఎస్సై జోక్యం చేసుకున్నాడని డీజీపీకి
బాధితుల ఫిర్యాదు
బీఆర్‌ఎస్ నాయకుల సంబురాలు..
ఎస్సై మహేందర్ సస్పెండ్ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు నెక్కొండ అంబేడ్కర్ సెంటర్‌లో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎస్సై అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించాడని ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అమాయకులపై రౌడీషీట్లు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీపీ ఫ్లెక్సీకి నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివకుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


