● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్‌బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : జూడో పోటీలు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కైలాశ్‌యాదవ్ తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ ఓ సిటీలోని ఇండోర్ స్టేడియంలో వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సబ్–జూనియర్ నేషనల్ జూడో చాంపియన్ షిప్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో జూడో క్రీడను విస్తరింపచేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజీజ్ ఫరూక్వి, ఉపాధ్యక్షుడు జిల్లెల్ల శ్రీనివాసరావు, జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఎంఎస్ దిలీప్, సంయుక్త కార్యదర్శి సంతోష్‌కుమార్, సాయిరాం, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్, తోట శ్యామ్, విష్ణువర్ధన్, సీహెచ్ రాము, నాయకపు రాజు, సభ్యులు పాల్గొన్నారు.


