● కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
కేయూ క్యాంపస్: విశ్వవిద్యాలయ రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కేయూతో సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాల పాటు సేవలందించిన ఉపాధ్యాయులు రిటైర్‌మెంట్ అనంతరం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. వయోభారంతో వైద్య ఖర్చులు అధికం కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు మరింత కష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిపాదిత ఉద్యోగుల ఆరోగ్య పథకంలో విశ్వవిద్యాలయ రిటైర్డ్ సిబ్బందిని చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రవీందర్, బాధ్యులు పాల్గొన్నారు.
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు
న్యూశాయంపేట : అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. హనుమకొండ పార్టీ కార్యాలయంలో బి.సంతోష్ అధ్యక్షతన పార్టీ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారుల అండదండలతో పేదల అసైన్డ్ భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని, వాటిని అధికారులు రద్దు చేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిచో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి జిల్లావ్యాప్తంగా ‘ఇంటింటికి సీపీఐ’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, స్టాలిన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


