సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్‌రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్‌హోమ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు.


