ఎన్నికలకు సిద్ధం కావాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో జరిగే సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలకు అన్ని విధాల సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలక్టరేట్ సమావేశ హాల్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఈనెల 11వ తేదీన జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తదితర ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బస్సులు, పోలీసు బందోబస్తు, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 8వ తేదీలోగా పూర్తి కావాలన్నారు. ప్రతీ మండలానికి రెండు హరిత పోలింగ్ కేంద్రాలు ఉండేటట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా.. ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతం, పారదర్శకత, సమర్థతకు కట్టుబడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పనా, మండల ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.


