ఏసీబీ వలలో ఇన్‌చార్జ్‌ డీఈఓ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఇన్‌చార్జ్‌ డీఈఓ

Dec 6 2025 7:21 AM | Updated on Dec 6 2025 7:21 AM

ఏసీబీ వలలో ఇన్‌చార్జ్‌ డీఈఓ

ఏసీబీ వలలో ఇన్‌చార్జ్‌ డీఈఓ

ఏసీబీ వలలో ఇన్‌చార్జ్‌ డీఈఓ

హన్మకొండ అర్బన్‌: జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ వెంకట్‌రెడ్డి శుక్రవారం ఏసీబీకి చిక్కారు. పాఠశాల అనుమతుల పునరుద్ధరణ కోసం రూ.లక్ష లంచం డిమాండ్‌ చేసి, అందులో రూ.60 వేలు తీసుకున్న అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ వెంకట్‌రెడ్డితోపాటు విద్యాశాఖ సిబ్బంది గౌస్‌, మనోజ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కొత్తూరు జెండా ప్రాంతంలో ఉన్న క్రియేటివ్‌ మోడల్‌ హైస్కూల్‌ పదేళ్ల పునరుద్ధరణ అనుమతుల కోసం యాజమాన్యం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. ఎంతకీ అనుమతులు రాకపోవడంతో స్కూల్‌ యజమానులు.. డీఈఓ కార్యాలయ సెక్షన్‌ అసిస్టెంట్లు గౌస్‌, మనోజ్‌ను సంప్రదించారు. ఫైల్‌ ఆమోదానికి రూ.లక్ష ఇవ్వాలని, ఇస్తే డీఈఓ ఆమోదిస్తారని గౌస్‌, మనోజ్‌ వారికి తెలిపారు. అంతమొత్తం ఇవ్వలేమని నేరుగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ వెంకట్‌రెడ్డిని కలిశారు. సిబ్బందికి చెబుతాననని, వారిని కలవమని ఆయన చెప్పారు. ఈసారి వారు రూ.75 వేలు ఇవ్వాలని చెప్పారు. మరోమారు వెంకట్‌రెడ్డిని కలిసి అంతమొత్తం ఇవ్వలేమని చెప్పడంతో కొంత తగ్గించి ఇవ్వమని తాను చెబుతానని భరోసా ఇచ్చారు. చివరగా శుక్రవారం రూ.60 వేలు మనోజ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

సాయంత్రం 5:30 నుంచి

రాత్రి 8 గంటల వరకు దాడులు

సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన దాడులు దాదాపు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలను వెల్లడించారు. ముగ్గురిని శనివారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు.

కలెక్టరేట్‌లో తొలిదాడి

హనుమకొండ కలెక్టరేట్‌ కొత్త భవనం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ఈ భవనంలో ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఉద్యోగులు విధులు ముగించుకొని బయటకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఎదురుగా ఉన్న కలెక్టర్‌ చాంబర్‌లోనే

దాడులు జరుగుతున్న సమయంలో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సమావేశాలు ముగించుకొని తన చాంబర్‌లోనే ఉన్నారు. ఏసీబీ చర్యలు కొనసాగుతుండగా గంటకుపైగా అదే భవనంలో కలెక్టర్‌ ఉన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

గతంలో కూడా..

ఈ కేసులో పట్టుబడిన అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, గతంలో ఉమ్మడి జిల్లాలో జనగామ ఆర్డీఓగా, ఆపై నల్లగొండ జిల్లాలో పనిచేశారు. నల్లగొండలో చేసిన కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, జనగామలో భూసేకరణ విషయంలో ఆరోపణలు, విచారణలు జరిగాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

అసలు గురి తప్పిందా..?

ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ డీఈఓగా ఉన్న అదనపు కలెక్టర్‌ ఏసీబీకి పట్టుబడిన విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, తీవ్ర ఆరోపణలతో వారిని రాష్ట్ర అధికారులు తప్పించారని ప్రచారం సాగుతోంది. అక్కడికి ఇన్‌చార్జ్‌గా వచ్చిన వెంకట్‌రెడ్డి ఏసీబీకి బుక్కయ్యారని అంటున్నారు. లేదంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు చిక్కేవారని చర్చ సాగుతోంది.

బదిలీ కోసం ప్రయత్నిస్తూ..

ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ వెంకట్‌రెడ్డి జిల్లా నుంచి బదిలీ కోసం ఇటీవల తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న విద్యాశాఖ వ్యవహారంలో ఆయన ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన బదిలీ దరఖాస్తు చేసిన నేపథ్యంలో జిల్లాకు అదనపు కలెక్టర్‌గా వచ్చేందుకు గతంలో ఉమ్మడి జిల్లా సమయంలో వరంగల్‌(ప్రస్తుతం హనుమకొండ) ఆర్డీఓగా పనిచేసిన అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాకు వచ్చి ఒకరిద్దరు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పని పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

జిల్లా అదనపు కలెక్టర్‌

వెంకట్‌రెడ్డితో పాటు ఇద్దరు

ఉద్యోగుల అరెస్ట్‌

పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.60 వేల లంచం

కలెక్టరేట్‌ భవనంలో డబ్బులు

తీసుకుంటుండగా

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

డీఈఓ ఆఫీస్‌ నుంచి

కలెక్టరేట్‌కు మారిన సీన్‌...

మొదట డబ్బులు గౌస్‌కు ఇచ్చేందుకు బాధితులు డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గౌస్‌లేడు.. మనోజ్‌ ఒక్కడే ఉన్నాడు. డబ్బులు తెచ్చామని చెప్పడంతో కలెక్టరేట్‌లో ఉన్న అదనపు కలెక్టర్‌తో ఫైనల్‌ ఫిగర్‌ నిర్ధారించుకునేందుకు మనోజ్‌ కూడా కలెక్టరేట్‌కు వచ్చాడు. సార్‌తో మాట్లాడిన తరువాత ఐడీఓసీ వెనుక సీసీ కెమెరాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి వారి నుంచి రూ.60వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడే కాపు కాస్తున్న ఏసీబీ అధికారులు మనోజ్‌ను అదుపులోకి తీసుకుని అదనపు కలెక్టర్‌చాంబర్‌కు తీసుకుచ్చారు. విచారణ అనంతరం వెంకట్‌రెడ్డి, మనోజ్‌, గౌస్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement