ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు
శివకుమార్‌నాయుడు
హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా పరిశీలకుడు శివకుమార్‌నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ పరిశీలకులు ఎలక్షన్ కమిషన్‌కు కన్నులాంటి వారని, వీరి ద్వారానే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియ చూస్తుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి, 70 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరు విధులు నిర్వర్తించి నివేదికలు అందించాలని సూచించారు. జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, మాస్టర్ ట్రైనర్స్ సుధాకర్‌రెడ్డి, రవి, శ్రీనివాస్ స్వామి పాల్గొన్నారు.
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్..
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను హనుమకొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు శివకుమార్‌నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలో మొదటి విడత 69 గ్రామ సర్పంచ్, 658 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని మొత్తం 761 ప్రిసైడింగ్ అధికారులు, 1149 ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు అధికారులు తెలిపారు.


