సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర శివార్లలో లాజిస్టిక్ హబ్ (సరుకు నిల్వ కేంద్రాలు)ల నిర్మాణం కోసం అడుగు ముందు పడడం లేదు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించి మూడేళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. మాస్టర్‌ప్లాన్–2041లో భాగంగా ఆయా ప్రాంతాలను గుర్తిస్తూ నోట్ చేసినా, ఆ మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఎక్కడా వేసినా గొంగళి అక్కడే అన్న చందగా మారింది. ఈ సరుకు నిల్వ కేంద్రాలు శివార్లలో ఉంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అవసరమయ్యే సరుకులు, ఇతర సామగ్రి భద్రంగా ఉండే అవకాశముందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు గ్రేటర్ వరంగల్ నగరంపై పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడి, రోడ్డు ప్రమాదాలు తగ్గించే అవకాశముంది. సీఎం రేవంత్‌రెడ్డి నగర పర్యటనకు వచ్చిన సమయాల్లో కుడా అధికారులు ఈ అంశాలను తీసుకెళ్లారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతోనే ఎక్కడికక్కడే ఉందన్న టాక్ ఉంది.
ఐదు ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు..
హైదరాబాద్ నగర శివార్లలో బాటాసింగారం, మంగళపల్లిలో నిర్మించిన లాజిస్టిక్ హబ్ (సరుకు నిల్వ కేంద్రాలు)ల మాదిరిగా గ్రేటర్ వరంగల్ శివార్లలో నిర్మించాలనే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వరంగల్‌లోని చింతపల్లి, ములుగురోడ్డు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నష్కల్, హసన్‌పర్తి సమీపంలోని రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలతోపాటు మామునూరు విమానాశ్రయ సమీపంలో ఈ లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించారు. లాజిస్టిక్ హబ్‌ల ద్వారా ఏకకాలంలో 250కిపైగా భారీ వాహనాలు పార్కింగ్ చేసే వీలుంది. గ్రేడ్ ఏ వేర్ హౌసింగ్ సెంటర్, మినీ గోడౌన్లు, ఆటో మొబైల్ సర్వీస్ సెంటర్లు, ఇంధన స్టేషన్లు, కోల్డ్ స్టోరేజీ ఉంటాయి. వేల క్వింటాళ్ల సరుకు నిల్వ చేసే అవకాశముంది. డ్రైవర్ల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డార్మెటరీలు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ట్రక్‌లు, మినీ వెహికల్స్ నడిపేవారికి ఎక్కువగా ఉపయుక్తం కానుంది. ఈ లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణం అంశంపై ఓ ‘కుడా’ అధికారిని ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
నగరంలో లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణానికి ముందుకుపడని అడుగు
సరుకు నిల్వ కేంద్రాల ఏర్పాటుకు
చొరవచూపని ప్రజాప్రతినిధులు
అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి.. తీరనున్న ట్రాఫిక్ సమస్య


