వరాహాల విహారం
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలోని స్లమ్ ఏరియాల్లో పందుల బెడద తీవ్రమవుతోది. ప్రజలపై పందులు దాడులు చేస్తున్నా.. వాటి ద్వారా రోగాలు వ్యాపిస్తున్నా.. పాలకులు, అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక స్థలాల్లో పందులు పెంచుకోవాల్సి ఉండగా, నగరంలోని పలు వీధుల్లో, ఇళ్ల మధ్య వదిలేస్తున్నారు. దీంతో చెత్త కుప్పలు, మురుగు కాల్వల్లో సంచరిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పందులను కుట్టిన దోమలు ప్రజలను కుడుతుండడంతో మెదడు వాపు, డెంగీ, మలేరియా వంటి రోగాలు ప్రబలుతున్నాయి. నగరంలో పందుల పెంపకందార్ల మాఫియా నడుస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా ప్రజారోగ్యం అధికారులు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతుండంతో వీరికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వెనుకబడిన కాలనీల్లోని ప్రజలు పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎటుచూసినా పందులే..
బల్దియాలోని పాత బస్తీల్లో ఎటు చూసినా పందులే కనిపిస్తున్నాయి. నివాస ప్రాంతాలకు దూరంగా పందులను పెంచుకోవాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ పెంపకందారులు పట్టించుకోవడం లేదు. వాటిని నగరానికి దూరంగా తరలించాలన్న బల్దియా అధికారుల ప్రయత్నాలు పందుల పెంపకందార్లు తిప్పకొడుతున్నారు. వరంగల్‌లోని చింతల్, గరీభీ నగర్, ఎస్‌ఆర్ నగర్, లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, దేశాయిపేట, అండర్ రైల్వే గేట్‌లోని సాకరాశికుంట, కోయవాడ, కాశికుంట, కాజీపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద, బాపూజీనగర్ తోపాటు విలీన గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.
నోటీసులు జారీ చేస్తాం..
పందుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నామని పలువురు పెంపకందారుల విజ్ఞప్తి మేరకు ఔట్ సోర్సింగ్ కార్మికులుగా ఉపాధి కల్పించాం. కొంత మంది ఇంకా పందులు పెంచుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటాం. నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం.
– రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్‌ఓ
నగరంలో పందుల
సంచారంతో వ్యాధుల ముప్పు
ఉపాధి కల్పించినా నగరాన్ని వీడని పెంపకందారులు
పట్టించుకోని గ్రేటర్ పాలక,
అధికార వర్గాలు


