తుపాను బాధితులను ఆదుకోవాలి
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలో మోంథా తుపానుతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులందరికీ పరిహారం చెల్లించాలన్నారు. అలాగే వాగులో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. పొలాల్లో ఇసుక మేటలు తేలి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.10 వేలు ప్రభుత్వం ప్రకటించిందని, పంట నష్టం కింద రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు.
బస్‌జాతను జయప్రదం చేయాలి..
సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఈనెల 18, 19 తేదీల్లో హనుమకొండ జిల్లాలో జరిగే రాష్ట్ర బస్‌జాతను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 26న ఖమ్మం వేదికగా జరిగే సీపీఐ శత వసంతాల ఉత్సవ ముగింపు సభ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. వందేళ్ల ముగింపు ఉత్సవాల సందర్భంగా బస్సు జాతను జరుగనుందని, ఈ జాత నవంబర్ 18న భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో ప్రారంభమై 19న పరకాలలో ముగించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లనుందని తెలిపారు. ఈ బస్సు జాతలో పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు అదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, స్టాలిన్, రామచంద్రారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ సీనియర్ నాయకుడు
చాడ వెంకట్‌రెడ్డి


