ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణాలు వేగంగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు వారం రోజుల్లోగా పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. 295 స్లాబ్ లెవెల్‌కు వచ్చిన ఇళ్లు పది రోజుల్లో పూర్తి చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు రూ.లక్షలోపు రుణాలు అందించి త్వరగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు తోడ్పాటునందించాలన్నారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు ప్రతీ రోజు పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని చోట ఎందుకు ప్రారంభం కాలేదో ఆ వివరాల నివేదికను వారం రోజుల్లో అధికారులు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, హౌసింగ్ పీడీ హరికృష్ణ, మెప్మా పీడీ జోనా, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డివిజన్ డీసీ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మా, హౌసింగ్ డీఈలు రవీందర్, సిద్ధార్థనాయక్, ఎంపీడీఓలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
పనుల పురోగతి నివేదిక అందించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్


