‘పది’కి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

‘పది’కి ప్రణాళిక

Oct 23 2025 2:09 AM | Updated on Oct 23 2025 2:09 AM

‘పది’

‘పది’కి ప్రణాళిక

‘పది’కి ప్రణాళిక

వందశాతం ఉత్తీర్ణతకు విద్యాశాఖ కార్యాచరణ

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 2024–2025లో పదో తరగతిలో విద్యార్థులు 96.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈవిద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ నుంచే సాయంత్రం 4–15 గంటల తర్వాత మరో గంటపాటు విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు టీచర్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన చేస్తున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో కలిపి సుమారు 11,500 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

జనవరి 9 వరకు సిలబస్‌ పూర్తిచేయాలి..

అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 9 వరకు పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు కూడా ప్రతి పాఠశాలలోను వంద శాతం నమోదయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.డివాసంతి హెచ్‌ఎంలను ఆదేశించారు. అవసరమైతే టీచర్లు తల్లిదండ్రులతో, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం హాస్టళ్ల వార్డెన్లతోను మాట్లాడి విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనవరిలో ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రత్యేక తరగతులపై సమీక్ష..

సమగ్రశిక్ష రూపొందించిన గణితం, ఫిజిక్స్‌, బయాలజికల్‌ సైన్స్‌, సోషల్‌కు సంబంధించిన అభ్యాసక దీపికలను కూడా ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అందజేశారు. పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ అంశాలు సులభరీతిన చదువుకొని ప్రశ్నలకు సమాధానాలు రాసేవిధంగా ఈ అభ్యాసక దీపికల్లో ముఖ్యమైన అంశాలతో పొందుపరిచారు. వాటిని విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. వాటిలో కూడా ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నారు. గణితంలో గ్రాఫ్‌లు, రేఖాగణిత నిర్మాణాలు, సైన్స్‌లో రేఖాచిత్రాలు, ప్రయోగాలు, సాంఘిక శాస్త్రంలోని మ్యాప్‌పాయింటింగ్‌ లాంటివాటిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు స్వతంత్రంగా పాఠాలు చదవడానికి, ప్రశ్నలకు సమాధానం రాసేందుకు టీచర్లు ప్రొత్సహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో వారానికోసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష చేస్తారు. విద్యార్థుల అభ్యసనాల స్థాయిని కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. వారాంతపు పరీక్షలు కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.

టీచర్లు కీపేపర్‌ తయారు చేయాలి..

జిల్లాలో ఈనెల 24 నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కరబరచాల్సి ఉంటుంది. పరీక్ష తదుపరి ప్రతి సబ్జెక్టు టీచర్‌ ఆ ప్రశ్నపత్రం ఆధారంగా నమూనా జవాబుపత్రంను కీ(పేపర్‌) తయారుచేసి విద్యార్థులకు చూపించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు.

అభ్యాసక దీపికలను

సాధన చేయించాలి

అభ్యాసక దీపికలను ప్రతిరోజు సాధన చేయించాలి. విద్యాప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ఉదయం వేళ అధ్యయన అలవాటును ప్రోత్సహించేందుకు వేకప్‌ కాల్‌ టీచర్లు చేయాలి. టెన్త్‌లో జిల్లా వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆయా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైనప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల పురోగతిని వివరించాల్సి ఉంటుంది.

– వాసంతి, హనుమకొండ

జిల్లా విద్యాశాఖాధికారి

హసన్‌పర్తిలో విద్యార్థుల దత్తత

హసన్‌పర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకొని వేకప్‌ కాల్స్‌ కూడా చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించేందుకు సమావేశం కూడా నిర్వహించనున్నాం. ప్రతీ హైస్కూ ల్‌లో విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి, వారికి సబ్జెక్టుల వారీగా టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం.

– ఎ.శ్రీనివాస్‌, హసన్‌పర్తి ఎంఈఓ

సాయంత్రం వేళ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

పాఠశాలల్లో అభ్యాసక

దీపికల పంపిణీ

హనుమకొండ జిల్లాలో పరీక్షలకు

హాజరుకానున్న 11,500 మంది విద్యార్థులు

‘పది’కి ప్రణాళిక1
1/2

‘పది’కి ప్రణాళిక

‘పది’కి ప్రణాళిక2
2/2

‘పది’కి ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement