
108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ ఉమ్మడి జిల్లా మేనేజర్ నసీరుద్దీన్
కమలాపూర్ : 108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు, రోగులకు మెరుగైన సేవలు అందించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా మేనేజర్ నసీరుద్దీన్ సూచించారు. కమలాపూర్ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉన్న 108 అంబులెన్సును హనుమకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్‌తో కలిసి బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, అంబులెన్సులోని సక్షన్ ఆపరేటర్, ఏఈడీ, గ్లూకోమీటర్, మానిటర్, ఆక్సిజన్, థర్మామీటర్ తదితర పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు. 108 వాహన సిబ్బంది మండల ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర కాల్స్ రాగానే వెంటనే స్పందించి 30 సెకన్లలో బయలుదేరి వెళ్లి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ బండ ఉపేందర్, పైలట్ చేలిక తిరుపతి తదితరులు పాల్గొన్నారు.