
ధాన్యం సేకరణలో భారీ అక్రమాలు
అక్రమార్కులపై కేసు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో అతి పెద్ద ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ శశిధర్‌రాజు, ఓఎస్డీ ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధాన్యం కొనుగోలులో గుర్తించిన అక్రమాలు, తీసుకున్న చర్యలపై ఎస్పీ మాట్లాడుతూ.. రబీ 2024–25 సీజన్‌లో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి కుట్ర చేసి, నకిలీ రైతులను సృష్టించి ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టి విచారణ జరిపి అక్రమాలు గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట, కాట్రపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. కమలాపూర్‌కు చెందిన సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్ ఈ మోసానికి ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
నకిలీ ప్రొఫైల్..
బెజ్జంకి శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులు, మధ్యవర్తులు, కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మకై ్క ఆన్‌లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ పోర్టల్‌ను ఉపయోగించి 12 మంది నకిలీ రైతుల ప్రొఫైళ్లు సృష్టించాడని ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ రైతులు 278 ఎకరాల భూమిని సాగు చేసినట్లుగా సదరు రైస్ మిల్లుకు 8,049.6 క్వింటాళ్ల ధాన్యాన్ని సరఫరా చేసినట్లుగా చూపించారన్నారు. వాస్తవానికి ఎక్కడా ధాన్యం సేకరించలేదని, రవాణా చేయలేదని తెలిపారు. ఈ అవకతవకల ద్వారా రూ.1,86,63,088 మొత్తాన్ని అక్రమంగా క్లెయిమ్ చేసుకున్నట్లు, ఆ నగదును నకిలీ లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు.
సహకరించిన అధికారులు
అక్రమాలకు పాల్పడినవారిలో బండ లలిత నకిలీ ఎంట్రీల అక్రమ సృష్టికి మధ్యవర్తిగా వ్యవహరించారని, ప్రైవేట్ ఆపరేటర్ వాంకుడోత్ చరణ్ కీలక పాత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ బి.హైమావతి, కాట్రపల్లి కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ అనిత ఇతరులకు ట్యాబ్‌లు ఇచ్చి అక్రమాలకు సహకరించారన్నారు. వ్యవసాయ అధికారులు ఏఓ కె.గంగజమున, ఏఈఓలు బి.అర్చన, ఎం.సుప్రియ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు సహకరించారని తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్‌రావు ధాన్యాన్ని భౌతికంగా రవాణా చేయకుండానే 27 లారీల చిట్టీలకు రవాణా ఛార్జీలను క్లెయిమ్ చేశారని గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 12 మంది నకిలీ రైతులు, 278 ఎకరాల భూమి, 8,049 క్వింటాళ్ల దాన్యం ద్వారా రూ.1,86,63,088 కొల్లగొట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. విచారణ అనంతరం నగదు రికవరీ, పోర్టల్ నుంచి భూమి తొలగింపు, తదుపరి క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.
రూ.1.86 కోట్లు
దుర్వినియోగం
రికవరీ, క్రిమినల్ చర్యలకు ఆదేశం
రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్,
టాస్క్‌ఫోర్స్ అధికారులు
శాయంపేట: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని శ్రీనివాస్, వారికి సహకరించిన బండ లలిత, వాంకుడోత్ చరణ్, బలబద్ర హైమావతి, అనిత, వ్యవసాయ అధికారులు గంగాజమున, అర్చన, సుప్రియ, రవాణా కాంట్రాక్టర్ సుధతి రాజేశ్వర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.