
ఎక్కడి చెత్త అక్కడే..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మూడువేలకు పైగా ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయించాల్సిన అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. చెత్త సేకరణకు బల్దియాకు చెందిన 250 స్వచ్ఛఆటోలు, 152 ఓనర్ కమ్ డ్రైవర్ ఆటోలు తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు. వాటికి రోజు డీజిల్ కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే 150 ఆటోలు కూడా తిరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకఎక్కడ చూసినా చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి.
చెత్త సేకరణలో చిత్తశుద్ధి కరువు
రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడం లేదని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనం మరమ్మతు కొస్తే వారం, పది రోజుల వరకు చెత్త సేకరించే నాథుడే కనిపించరు. ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ అనారోగ్యానికి గురైతే ప్రత్యామ్నయంగా మరో ఆటో లేదా ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించాల్సి ఉంది. కానీ, అలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వరుసగా పండుగలు, వర్షాలు ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న అపరిశుభ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్యం అధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు నామమాత్రంగా పనిచేస్తున్నారు. కమిషనర్ రోజు డివిజన్లలో పర్యవేక్షిస్తూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
అపరిశుభ్రంగా పలు కాలనీలు..
హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ, ఇందిరానగర్, భవానీనగర్, టీచర్స్ కాలనీ–1,2, నక్కలగుట్ట, కేఎల్‌రెడ్డి కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ, బాలసముద్రం తదితర ప్రాంతాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. వరంగల్‌లోని రామన్నపేట, గంగపుత్ర వీధి, బీసీ కాలనీ, గాంధీ విగ్రహం, ఓఎస్‌ఆర్‌నగర్, రఘునాథ్ కాలనీ, పాత బీటుబజారు, రైల్వేగేట్, హంటర్ రోడ్డు, సంతోషిమాత కాలనీ, కొత్తవాడ, రంగంపేట, కాశీబుగ్గ, లేబర్‌కాలనీ, శివనగర్, విద్యానగర్, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేటలో చెత్తసేకరణ చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. విలీన గ్రామాల్లో ఇంటింటా చెత్తసేకరణ నామమాత్రంగా కొనసాగుతోంది. ఇప్పటికై నా గ్రేటర్ అధికారులు స్పందించి కాలనీల్లో రోజూ చెత్త సేకరించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
స్వచ్ఛ ఆటోల కోసం ప్రజల ఎదురుచూపులు
మరమ్మతులు, సెలవుల పేరుతో
విధులకు డ్రైవర్ల డుమ్మా
చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటో రాక పది రోజులవుతోంది. ఇళ్లల్లో చెత్త నిల్వ చేయలేకపోతున్నాం. కంపు వాసన భరించ లేకపోతున్నాం. స్వచ్ఛ ఆటో డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీ–1కు చెందిన రజిత ఆవేదన ఇది.
ఆదివారం, ఇతర సెలవులు, పండుగలు, స్వచ్ఛ ఆటో రిపేర్ ఉందని, చెత్త సేకరణకు కార్మికుడు తోడు లేడని డ్రైవర్ కారణాలు చెబుతున్నాడు. రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నట్లు వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.. ఇలా ఏదో ఒకరి చెత్త బాధలు కావు ఇవి. నగర వ్యాప్తంగా 60 శాతం కాలనీల్లో ఇదే పరిస్థితి దాపురించింది. చెత్త సమస్యతో నగరవాసులు సతమతమవుతున్నారు.

ఎక్కడి చెత్త అక్కడే..