
మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలి
గీసుకొండ: మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. రూ.10 లక్షల ఎంపీ నిధులతో కొనాయమాకుల వద్ద గల సెర్ప్ ప్రగతి మండల సమాఖ్య భవన ప్రహరీ నిర్మాణానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. పొదుపు సంఘాల మహిళలు శాని టరీ న్యాప్కిన్ల తయారీలో శిక్షణ పొంది యూనిట్లను నెలకొల్పాలని ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మూడు శిఖలు కలిసి ఉండవనే నానుడి ఉండేదని, అయితే ఆ పరిస్థితి మారిపోయి మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారన్నారు. ఎంపీ కడియం కావ్య తన నియోజకవర్గానికి రూ.65 లక్షల నిధులను కేటాయిస్తే వాటిలో ఎక్కువగా మహిళల సంక్షేమానికి కేటాయించానని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ కేజీబీవీల్లో కూరగాయలు, వంట సామగ్రిని మెనూ ప్రకారం అందించేందుకు గీసుకొండ సంఘాల ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంఘాల వారు ఉత్పత్తి చేసిన వస్తువులను కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ డే రోజు స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్‌డీఓ రేణుకాదేవి, ఈఈ ఇజ్జగిరి, డీఈఈ జ్ఞానేశ్వర్, డీపీఎం దాసు, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం సురేశ్‌కుమార్, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక, సీసీలు కోల శోభ, కక్కెర్ల సుజాత, గడ్డి అశోక్, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, ఆకుల రుద్రప్రసాద్, కూసం రమేశ్ పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య