
పూర్తి ఫీజు రాయితీ
రామన్నపేట : టీజీ పాలిసెట్ –2025 కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, నవోదయ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖల ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించనున్నట్లు వరంగల్ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, టీజీ పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరాయితీ పొందాలంటే అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను సందర్శించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94921 10750 నంబర్‌లో సంప్రదించాలని, లేదా అధికారిక వెబ్‌సైట్ http://tgpolycet. nic.inను సందర్శించాలని కోరారు.
ప్రజలకు నమ్మకం కలగాలి
కాజీపేట: పోలీస్ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. కాజీపేట పోలీస్ స్టేషన్‌ను బుధవారం సీపీ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. సీఐ సుధాకర్‌రెడ్డి సీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీస్ సిబ్బంది చేసిన పరేడ్‌తో పాటు కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ విభాగాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డుల్ని పరిశీలించి కేసుల పూర్వాపరాలు, రికార్డుల నిర్వహణ బాగుందని అభినందించారు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పీఎస్‌ను సందర్శించి క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు నవీన్‌కుమార్, లవన్‌కుమార్, శివ పాల్గొన్నారు.
‘యునైటెడ్ వే ఆఫ్
హైదరాబాద్’తో ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌కు మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈఒప్పందం ద్వారా 250 మంది విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, డేటా సైన్స్ తదితర అంశాల్లో కేంద్రీకృత శిక్షణ ఇవ్వనున్నారు. ఈశిక్షణతో విద్యార్థుల్లో ఉద్యోగావకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పంద లక్ష్యం అని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ బుధవారం తెలిపారు. ఎంఓయూపై కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ భరత్, సీనియర్ అసోసియేట్ సౌమ్యమైరెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మహేందర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.
‘కే హబ్’ సందర్శన
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని టీహబ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూకా, స్టాఫ్ డైరెక్టర్ బెంజిమిన్ బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్‌ను సందర్శించారు. ఈపర్యటన సందర్భంగా వారు కే హబ్‌లోని వసతులు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి అనుకూలంగా ఉండే సాంకేతిక శాసీ్త్రయ వాతావరణ పరిస్థితులపై వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో చర్చించారు. త్వరలోనే టీ హబ్, కే హబ్‌కు మధ్య ఎంఓయూ చేసుకోనున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం వెల్లడించారు. కార్యక్రమంలో రూసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, కేయూ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య బి.సురేశ్‌లాల్, కె హబ్ డైరెక్టర్ టి.సవితాజ్యోత్స్న, డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎన్.వాసుదేవరెడ్డి, బొల్లం కిరణ్‌కుమార్, సిద్ధార్థ తదితరులున్నారు.

పూర్తి ఫీజు రాయితీ

పూర్తి ఫీజు రాయితీ