
ఇదేనా స్వచ్ఛత ?
మసకబారుతున్న ఓరుగల్లు ఖ్యాతి..
2012 క్లీన్‌సిటీ చాంపియన్‌షిప్ కార్యక్రమంలో వరంగల్ నగరానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. పారిశుద్ధ్య పనుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓరుగల్లుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో దేశవ్యాప్తంగా మూడో బహుమతి, ఐఎస్‌ఓ–14001 సర్టిఫికెట్, హడ్కో లాంటి పురస్కారాలు వచ్చాయి. దీంతో దేశంలో వరంగల్ రోల్ మోడల్‌గా నిలవడంతో వందల సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలు, అధికారులు ఇక్కడ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘనత వహించిన ఓరుగల్లు ఖ్యాతి మసకబారుతోంది. స్వచ్ఛ మాటలు, ప్రణాళికలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్మార్ట్‌సిటీగా పేరుగాంచిన వారసత్వ నగరం స్వచ్ఛత విధానాల అమలులో వెనుకంజలో ఉంది.
వరంగల్ అర్బన్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్ పరిస్థితి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో డొల్లతనం బయట పడింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ఏడాది 3 నుంచి 10 లక్షల జనాభా నగరాల్లో స్వచ్ఛ భారత్, సూపర్ లీగ్, స్వచ్ఛ లీగ్ సిటీస్ కేటగిరీల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో చోటు లభించిన నగరాల వివరాలను శనివారం సాయంత్రం వెల్లడించింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, కంటోన్మెంట్ మినహా ఏ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలు అర్హత సాధించలేకపోయాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లు స్వచ్ఛతలో చోటు సంపాదించుకుని కేంద్ర పురస్కారాలకు అర్హత పొందాయి.
నామమాత్రంగా చెత్త సేకరణ
ఘనవ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)లో గ్రేటర్ వరంగల్ వెనుకబడుతోంది. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ నామమాత్రంగా జరుగుతోంది. రోజుకు 470 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా.. 20 మెట్రిక్ టన్నుల చెత్త డ్రై వేస్ట్ రిసోర్స్ సెంటర్లకు చేరుతోంది. వాహనాలపై నిఘా లేక 30 టన్నుల చెత్త మేరకు నగరంలో పోగవుతోంది. చెత్త సేకరణలో పర్యవేక్షణ లోపం, డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడం, ప్లాస్టిక్ నిషేధించకపోవడం వంటి అంశాలు స్వచ్ఛతలో వెనుకబాటుకు కారణమవుతున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. శాసీ్త్రయ పద్ధతిలో చెత్త పూడ్చివేత ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.నాలుగు వేలకు కోట్లకుగా పైగా నిధులు కేటాయించారు. డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దకపోవడం, నిధులు విడుదల కాకపోవడంతో వెనుకబాటుకు గురవుతోంది. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్‌టీపీ) రెండు మాత్రమే పూర్తయ్యాయి. నగరం నుంచి 120 నుంచి 150 మియన్ లీటర్ ఫర్ డే (ఎంఎల్‌డీలు) మురుగు వస్తోంది. వీటి శుద్ధి పెద్దగా జరగడం లేదు. మరికొన్ని ఎస్‌టీపీలను నిర్మించాల్సిన అవసరం ఉంది. రూ.250 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో అమ్మవారిపేటలో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల ప్లాంట్ త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరో రెండు చోట్ల గార్బేజీ ట్రాన్స్‌ఫర్లు స్టేషన్లు ఏర్పాటు చేయాలి. వర్మీ కంపోస్టు, బయోమిథనైజేషన్ ప్లాంట్లను నెలకొల్పాలి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో ఆశించిన మేర కార్యక్రమాలు నిర్వహించడం లేదని నగరప్రజలు పేర్కొంటున్నారు.
పౌర స్పృహ పట్టింపేది?
పౌర స్పృహ పెంచేందుకు గడిచిన దశాబ్ద కాలంలో అనేక ప్రయోగాలు చేశారు. బల్దియా వీటి అమలులో నిర్లక్ష్యం, ఉదాసీనతతో వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మేయర్, కమిషనర్ ఆకస్మిక పర్యటనలు చేసినప్పుడు జరిమానా విధిస్తామని హెచ్చరించడం వరకే యంత్రాంగం పరిమితమవుతోంది. పట్టుదల, కార్యదక్షత బల్దియా వర్గాల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉన్నా.. పౌర స్పృహ కొరవడిన సందర్భాల్లో జరిమానా విధించే సౌలభ్యం ఉంది. నిర్లక్ష్యంతోనే ప్రకటనలు అపహాస్యానికి గురవుతున్నాయన్నది సుస్పష్టం. కేవలం పారిశుద్ధ్య పనుల కోసం 2,800 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం (యూజీడీ) నిర్మాణం, సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్‌ఎఫ్‌టీ), అదనంగా మానవ వ్య ర్థాల శుద్ధీకరణ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టీ), శాసీ్త్రయ పద్ధతులు తదితర అంశాల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో గ్రేటర్ వరంగల్ స్వచ్ఛతకు ఎంపిక కాలేదని భావిస్తున్నాం.
– రాజారెడ్డి, గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్‌ఓ
పరిశుభ్ర నగరాల జాబితాలో గ్రేటర్‌కు దక్కని చోటు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బయటపడిన
డొల్లతనం
చెత్త సేకరణలో కరువైన
అధికారుల పర్యవేక్షణ