
మరమ్మతుల జాడేది?
ప్రమాదంలో పాకాల సరస్సు తూములు
నర్సంపేట: సాగునీటి పరంగా జిల్లాకు తలమానికంగా నిలిచిన పాకాల సరస్సు తూములు శిథిలావస్థకు చేరాయి. సాగునీటి కాల్వలు చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. దీంతో వ్యవసాయ అవసరాలకు నీరుసరిపడా సక్రమంగా అందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 3,8,500 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నాయి. అందులో వరి పంటకు పాకాల సరస్సు ప్రధాన నీటి వనరు. జిల్లా మొత్తంలో లక్షా 45 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతుండగా అందులో 40 నుంచి 50 వేల ఎకరాలకు పాకాల సరస్సు ద్వారా రెండు పంటలకు నీరు అందుతుంది.
శిథిలావస్థలో తూములు
జిల్లాలో ప్రాధాన్యత గల పాకాల తూములు శిథిలావస్థలోకి చేరుకున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా తూముల షెట్టర్‌లకు రంధ్రాలు పడి నీరు వృథాగా పోతుంది. తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారే తప్ప శాశ్వత మరమ్మతులు లేకపోవడంతో వృథాను అరికట్టలేకపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చెరువు అభివృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించారు. అయినప్పటికీ అభివృద్ధి పనులు ఆలస్యం అవుతుండడంతో చెరువు మనుగడకు ముప్పు నెలకొంది.
భూగర్భ జలాల అభివృద్ధికి దోహదం..
పాకాల సరస్సులోకి ఇటీవల కాలంలో గోదావరి జలాలను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో వరంగల్ జిల్లాలో సాగవుతున్న లక్ష 45వేల ఎకరాల వరి, పది వేల ఎకరాల మొక్కజొన్న, లక్షా 36వేల 500 ఎకరాల్లో విస్తీర్ణం సాగవుతున్న పత్తి, 1,200 ఎకరాల్లో సాగవుతున్న కంది, 9వేల ఎకరాల్లో సాగవుతున్న మిర్చి, వెయ్యి ఎకరాల్లో సాగువుతున్న పసుపు, 17,500 ఎకరాల్లో సాగవుతున్న ఇతర పంటలకు వ్యవసాయ బావులు, బోర్ల నుంచి నీరు అందించేందుకు పాకాల సరస్సు నీరు ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
వృథాగా పోతున్న నీరు
చెట్లు, ముళ్లపొదలతో
నిండిన కాల్వలు
సాగు, తాగు నీటికి ఇబ్బందులు
మరమ్మతుల కోసం ప్రతిపాదనలు
తాగునీటికీ ప్రధానమే..
పాకాల సరస్సు నుంచి అధికారికంగా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. అనధికారికంగా మరో 25 వేల ఎకరాలకు పాకాల సరస్సు ప్రధాన వనరుగా ఉంది. దీంతోపాటు నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కూడా తాగునీటి పరంగా పాకాల నీరే ప్రధానంగా నిలుస్తుంది. పంటలకు సాగునీరుగానే కాకుండా వాగుల ద్వారా మూడు నియోజకవర్గాల నుంచి ప్రవహిస్తూ తాగునీటిగానూ ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాకాల సరస్సు తూముల మరమ్మతులు వెంటనే చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

మరమ్మతుల జాడేది?