
యూరియా సరిపోయేనా..?
ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్‌కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్‌లో రేట్లు పెంచేసి సోమ్ము చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 3,08,320 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పసుపు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చెవరకు సుమారు 6 వేలపైగా బ్యాగుల యూరియా అవసరం. కానీ ఈ ఏడాది రైతులకు అవసరమైనంత మేర దొరక డం కష్టంగా కనిపిస్తుంది. నెలవారీ కోటాలో కేంద్రం కోత విధిస్తుండడంతో భవిష్యత్‌లో యూరి యా సరఫరా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఏపీ, 20:20 ఇతర ఎరువుల కొరత ఉండకపోవచ్చని సమాచారం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిల్వలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ నిల్వల వివరాలు చేప్పేందుకు వెనకాడుతున్నారు. అవసరం మేరకు సరఫరా లేకపోవడంతోనే ప్రస్తుతం వివరాలు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
1,11,430 టన్నుల ఎరువులు అవసరం
జిల్లాకు యూరియా 47వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 16,805 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,270 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్పీ 6,615, ఎన్‌పీకే కాంప్లెక్స్ 26,740 మెట్రిక్ టన్నులు.. మొత్తం 1,11,430 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. కానీ ప్రస్తుతం యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.
గూడ్స్ షెడ్‌కు చేరిన ఎరువులు
ఈనెల 21న ఆర్‌సీఎఫ్ యూరియా 1,315.170 టన్నులు వరంగల్ గూడ్స్ షెడ్‌కు చేరుకోగా.. వరంగల్‌కు 4,781, హనుమకొండ 4,000, ములుగు 2,666, భూపాలపల్లి 5,777, జనగామ 2,888, మహబూబాబాద్ 8,000, కమిషనర్‌పూల్ 1,111 బస్తాల చొప్పున కేటాయించారు. ఇందులో మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, డీలర్లుకు 40 శాతం సరఫరా చేయగా.. యూరియా చేరిన రెండు రోజుల్లోనే స్టాక్ ఎక్కవ సెల్స్ పాయింట్స్‌లో క్లోజ్ చేయగా.. మరికొన్ని సొసైటీల్లో నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఐపీఎల్ కంపెనీకి చెందిన యూరియా 45,210 బస్తాలు రానున్నాయి.
నానోపై దృష్టి..
ప్రస్తుతం యూరియా సరఫరా తగినంత లేకపోవడంతో అధికారులు నానో యూరియా వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అంత త్వరగా రైతులు ఆటువైపు అడుగులు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి సరిపడే నానో యూరియా ధర మాములు దానికంటే తక్కువగానే ఉన్నా స్ప్రే చేసే విధానం ఉండడంతో రైతులు ముందుకెళ్లలేకపోతున్నారు.
ఉమ్మడి జిల్లాకు చేరిన 1,315
మెట్రిక్ టన్నుల యూరియా
రేపు మరో 45,210 బస్తాల రాక
యూరియా నిల్వలు ఉన్నాయి
జిల్లాలో యూరియా కొరత వాస్తవమే.. ఫోర్ట్ రోడ్డు ఖిలా వరంగల్ సొసైటీకి 444 యూరియా బస్తాలు రాగా.. 222 బస్తాలు నిల్వ ఉన్నాయి. గోదాంకు వచ్చిన ప్రతి రైతుకు ఎలాంటి నిబంధనలు లేకుండా యూరియా విక్రయిస్తున్నాం.
– కేడల జనార్దన్, ఖిలా వరంగల్
మండల సొసైటీ అధ్యక్షుడు