రైతు భరోసాకు వేళాయె
హన్మకొండ: రైతు భరోసాపై అన్నదాతలకు ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసాను ప్రారంభించింది. యాసంగిలో రైతు భరోసా పూర్తిగా అందించకపోవడంతో రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న క్రమంలో వానాకాలం సాగుకు రైతు భరోసా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు సోమవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాను ప్రారంభించారు. వానాకాలంలో రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని ఈ సీజన్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. హనుమకొండ జిల్లాలోని 14 మండలాలు, 163 గ్రామాల్లో 1,58,368 మంది రైతులుండగా.. వీరికి రూ.157,23,45,433ల పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసాగా అందించనున్నారు.
ఖాతాల్లో జమ కానున్న సొమ్ము
సోమవారం మొదటి రోజు 1,17,160 మందికి రూ.84,08,32,604లు జమ చేసేందుకు జాబితా ట్రెజరీకి చేరింది. వీరికి మంగళవారంలోపు రైతుల ఖాతాల్లో సొమ్ము జమకానుంది. ప్రభుత్వం రైతు భరోసాగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఏడు రోజుల్లో రైతులందరి ఖాతాల్లో సొమ్ము జమకానుంది. దీంతో ఈ సీజన్‌లో రైతులకు సమయానికి పెట్టుబడి సహాయం అందనుంది. ఈసారి ముందుగానే వర్షాలు కురవడంతో సాగు పనులు మొదలయ్యాయి. మెట్ట పంటల విత్తనాలు విత్తుతున్నారు. మాగాణి వరి సాగుకు రైతులు నార్లు పోస్తున్నారు. వరి సాగు పనులు క్రమంగా ముమ్మరం కానున్నాయి. ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం రైతు భరోసాను ఆశించకుండానే మెట్ట పంటల కోసం రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. వరి సాగు రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నార్లు పోస్తున్నారు. ప్రభుత్వం అందించే సహాయం వరి నాట్లకు, మెట్ట పంటలకు వేసే ఎరువుల కొనుగోలుకు ఉపయోగపడనుంది.
మండలాల వారీగా రైతు భరోసా వివరాలు
జిల్లాలో 1,58,368 మంది అన్నదాతలు
రైతులకు అందనున్న పెట్టుబడి సాయం రూ.157,23,45,433
మొదటి రోజు 1,17,160 మందికి రూ.84,08,32,604లు
ట్రెజరీకి జాబితా
మండలం గ్రామాలు రైతులు రైతు భరోసా (రూ.లు)
ఆత్మకూరు 12 8,616 10,12,47,552
భీమదేవరపల్లి 12 11,991 14,82,54,604
ధర్మసాగర్ 13 13,841 15,43,47,774
ఎల్కతుర్తి 13 12,864 13,34,10,048
హనుమకొండ 06 2,200 91,86,182
హసన్‌పర్తి 18 17,390 13,65,12,568
ఐనవోలు 10 14,671 16,54,97,201
కమలాపూర్ 16 17,008 16,74,67,961
కాజీపేట 10 8,576 5,97,01,636
వేలేరు 07 8,937 11,35,54,703
దామెర 10 8,616 8,70,64,411
నడికూడ 12 11,090 1,11,14,4716
పరకాల 11 8,222 7,51,26,762
శాయంపేట 13 11,761 1,09,82,9315


